తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. హుజూర్ నగర్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం అర్చన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో అర్చనతోపాటు, పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అర్చన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అర్చనతోపాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు గాయత్రి, గంగాభవాని, సతీష్ లు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, వీరి రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.


కొన్ని రోజుల నుంచి అవిశ్వాస లొల్లి....
గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సైదిరెడ్డి సన్నిహితుడైన రవి భార్య అర్చన చైర్పర్సన్ గా, సీనియర్ లీడర్ జక్కుల రాజేశ్వరరావు వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. మొదట్లో బాగానే ఉన్నా... అక్రమ వెంచర్ల వ్యవహారంలో ఎమ్మెల్యేకు, చైర్ పర్సన్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఈ గ్యాప్ లో వైస్ చైర్మన్ నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు దగ్గరయ్యారు. ఇదే అదునుగా భావించిన వైస్ చైర్మన్ నాగేశ్వరరావు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే కు చైర్పర్సన్ కు మధ్య సంది కుదిరినా... వైస్ చైర్మన్ అన్ని తానే వ్యవహరిస్తుండడంతో ఆధిపత్య పోరుకు కారణమైంది.


అక్రమ లేఔట్ల వ్యవహారమే కొంపముంచింది 
హుజూర్ నగర్ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల అవినీతి వల్ల బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమాల పై బహిరంగ చర్చ కు కాంగ్రెస్ పార్టీ  డిమాండ్ చేస్తుండటంతో పెద్ద సవాల్ గా మారింది. ఎమ్మెల్యే సైది రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు గురిపెట్టాయి. అక్రమ లేఅవుట్ ల వ్యవహారం పై చర్చకు  మీరు సిద్దమా అంటూ కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల మాయం పై వివరణ ఇవ్వాల్సిన మున్సిపల్ కమీషనర్ మౌనం వహిస్తున్నారని ఇది దేనికి సంకేతం అని వారు ప్రశ్నించారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మున్సిపాల్టీ లే అవుట్ అక్రమాల పై కాంగ్రెస్ పార్టీ బంద్ కు పిలుపు నిచ్చిందనీ  ఆ సమయం లో మీ పార్టీ నాయకులే చైర్మన్ గా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవినీతి జరిగి ఉంటే ఇప్పుడు ఉన్నది మీ పార్టీ యేనని అధికారుల విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు.


బుజ్జగించిన ఫలితం లేదు...


ఇన్నాళ్లు చాప కింద నీరులా హుజూర్ నగర్ మున్సిపాలిటీ వ్యవహారం పార్టీ చైర్ పర్సన్ అర్చన వేరే పార్టీలోకి మారేవరకు చేరింది. వైస్ చైర్మన్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ చైర్పర్సన్ తో పాటు కొందరు కౌన్సిలర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే వైస్ చైర్మన్ కు ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తూ మొదట అసమ్మతి గళం ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి చైర్ పర్సన్ ను, కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడిన గాని ఫలితం లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి ఇష్యులు పార్టీకి నష్టం కలగజేస్తాయని చెప్పిన గాని వినలేదు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పిన గాని వినలేదు.  చివరకు చైర్ పర్సన్ అర్చన, కౌన్సిలర్లు పార్టీ వీడారు