Revanth South Action Plan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ తరపున ఆయన దక్షిణాది వాదం వినిపించేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి అన్యాయం చేస్తోందని ఆయన అంటున్నారు. నిధుల విషయంలోనే కాదు రేపు డీలిమిటేషన్‌లోనూ అదే అన్యాయం చేస్తారని అంటున్నారు. ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో దక్షిణాది వాదంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఆయన ఆషామాషీగా ఆ మాటలు అనలేదని దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలను ఏకం చేసి కేంద్రంపై యుద్ధం ప్రకటించాలని రేవంత్ అనుకుంటున్నారు. దానికి నేతృత్వం వహించేందుకు కూడా సిద్దమంటున్నారు. 


చంద్రబాబు తప్ప అందరూ కలసి వస్తారనుకుంటున్న రేవంత్ 


దక్షిణాదిలో ఒక్క ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు పరస్పరం పోరాటం చేస్తున్నా జాతీయ స్థాయిలో కలిసే బీజేపీపై పోరాటం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో కాంగ్రెస్, మిత్రపక్షాల ప్రభుత్వాలే ఉన్నాయి. ఒక్క ఏపీలో మాత్రమే ఎన్డీఏ  ప్రభుత్వం ఉందని.. అక్కడి  సీఎం చంద్రబాబు ఎలాగూ కలసి రారు కాబట్టి ఆయనను పక్కన పెట్టి మిగిలిన రాష్ట్రాలతో కలిసి దక్షిణాది కోసం కేంద్రంపై యుద్ధం చేయాలని రేవంత్ అనుకుంటున్నారు. అందర్నీ దక్షిణాది అంశంపై ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. 


కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?


చాపకింద నీరులా దక్షిణాది భావన


కారణాలు ఏమైనప్పటికీ జాతీయస్థాయిలో దక్షిణాది దేశానికి ఎంతో కంట్రిబ్యూట్ చేస్తున్నా.. తిరిగి ఇచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉందన్న అభిప్రాయం మాత్రం బలంగా ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో పవన్ కల్యాణ్ కూడా దక్షిణాది వాదం వినిపించారు. అయితే చాలా మంది తమ రాజకీయ అవసరాలను బట్టి సైలెంట్ గా ఉండటంతో ముందుకు సాగడం లేదు. గతంలో కేరళ ముఖ్యమంత్రి.. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు.కానీ అందరూ ఏకతాటిపైకి రాలేకపోయారు. లేఖలతోనే సరిపోయింది. ఇప్పుడు రేవంత్ కు కాస్త పరిస్థితులు కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మరింత సీరియస్‌గా ప్రయత్నించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. 


మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం


దక్షిణాదికి అన్యాయం జరగనివ్వబోమంటున్న చంద్రబాబు


అయితే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దక్షిణాదికి అన్యాయం జరగబోదని అంటున్నారు. తాను దక్షిణాది ప్రయోజనాల కోసం ఉంటానని ఆయన ఎయిర్ పోర్టులో స్టాలిన్ కలినప్పుడు హామీ ఇచ్చారు. డీలిమిటేషన్‌లో జనాభాతో సంబంధం లేకుండా ఇప్పుడు ఉన్న నిష్ఫత్తి కొనసాగేలా చూడాలని అనుకుంటున్నారు. నిధుల విషయంలో  వివక్ష చూపితే తాను కూడా మాట్లాడతానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే  రేవంత్ పోరాటంలో  రాజకీయ కోణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర సీఎంలను కలుపుకుని ఢిల్లీపై పోరాటానికి ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.