Revanth Reddy NTR strategy GHMC elections 2026: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడూ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఉంటాయి. తాజాగా అమీర్‌పేట మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉదంతం కేవలం ఒక విగ్రహావిష్కరణగా కాకుండా, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఆయన వేసిన భారీ రాజకీయ స్కెచ్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ నామం.. రేవంత్ వ్యూహం
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి, గతంలో ఎన్టీఆర్ తో ఉన్న ఉన్న కాంగ్రెస్ వైరం చరిత్రను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ జపం చేయడం వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం సానుభూతిపరులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటంతో, ఆ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ అనాథగా మారింది. ఈ శూన్యాన్ని భర్తీ చేసి, ఆ ఓట్లను కాంగ్రెస్ ఖాతాలోకి మళ్లించడమే రేవంత్ అసలు లక్ష్యం.
సంప్రదాయ వ్యతిరేకతకు చెక్
సాధారణంగా తెలుగుదేశం సానుభూతిపరులు మొదటి నుంచీ కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పెరిగిన వారు. ఎన్టీఆర్ పెట్టిన కాంగ్రెస్ వ్యతిరేక పునాదులే వారి రాజకీయ సిద్ధాంతం. మరి అలాంటి వారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటే, ఆ పార్టీలో తమకు నచ్చిన వ్యక్తి ఉండాలి. రేవంత్ రెడ్డి సరిగ్గా ఆ పల్స్‌ను పట్టుకున్నారు. తాను కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ, తన రాజకీయ మూలాలు ఎన్టీఆర్ సిద్ధాంతాల్లోనే ఉన్నాయని, ఇప్పటికీ చంద్రబాబు పట్ల తనకు గౌరవం ఉందని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. చంద్రబాబును ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదే.
టీడీపీ క్యాడర్‌లో రేవంత్ క్రేజ్
తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ రేవంత్ రెడ్డిని మనవాడే అని భావిస్తుంది. ఇప్పుడు మైత్రివనం వంటి అత్యంత రద్దీ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, అటు సెటిలర్లను, ఇటు టీడీపీ అభిమానులను రేవంత్ తన వైపు తిప్పుకున్నారు. మా పార్టీ నాయకుడు కాకపోయినా, మా దైవానికి గౌరవం ఇచ్చారు అనే భావనను టీడీపీ శ్రేణుల్లో కలిగించడంలో రేవంత్ నూటికి నూరు శాతం విజయం సాధించారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి గర్వకారణం గా కీర్తిస్తూ, ఇటు తెలంగాణ వాదులను ఇబ్బంది పెట్టకుండానే అటు సెటిలర్ల మనసు గెలుచుకుంటున్నారు. దీనివల్ల గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడే సెంటిమెంట్ కార్డు ఇకపై పనిచేయదు. పైగా, ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ ఎక్కడ అని రేవంత్ ప్రశ్నించడం ద్వారా బీఆర్ఎస్ అధినేతను డిఫెన్స్‌లో పడేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష లాంటివి. నగరంలో కాంగ్రెస్ బలపడాలంటే టీడీపీ సానుభూతిపరుల మద్దతు అనివార్యం. అందుకే, ఆయన వ్యూహాత్మకంగా తన ప్రసంగాల్లో ఇందిరా గాంధీతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా సమానంగా వాడుతున్నారు. ఎన్టీఆర్ ప్రారంభించిన పక్కా ఇళ్ల పథకమే.. ఈనాటి ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పడం ద్వారా రెండు పార్టీల సిద్ధాంతాలను ఒకే తాటిపైకి తెచ్చారు. ఇది రాజకీయంగా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఇచ్చే అంశం. రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికం కాదు. రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం వెనుక ఉన్నది కేవలం అభిమానం మాత్రమే కాదు, పక్కాగా లెక్కగట్టిన పొలిటికల్ అరిథ్మెటిక్ . టీడీపీ ఓట్లను కాంగ్రెస్ వైపు తిప్పుకుంటే, గ్రేటర్ హైదరాబాద్‌లో తిరుగులేని శక్తిగా ఎదగవచ్చని ఆయన భావిస్తున్నారు. మరి రేవంత్ వేసిన ఈ విగ్రహ రాజకీయం ఓట్ల రూపంలో ఎంతవరకు మారుతుందో రాబోయే ఎన్నికలు తేల్చనున్నాయి.
