Mandula Samuel vs Pawan Kalyan:తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మందుల సామేలు వ్యవహారశైలి ఇప్పుడు సొంత పార్టీకే తలనొప్పిగా మారుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంలో   ఏపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంపై స్పందిస్తూ, ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను ఆయన వ్యక్తిగతంగా దూషించారు. నాగేశ్వర్ ఇష్యూలో అసలు కాంగ్రెస్ కు సంబంధం లేదు.  అయితే సామేలు దానిని ప్రాంతీయ ,  రాజకీయ కోణంలోకి మళ్లించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానమే ఇదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Continues below advertisement

 ఏపీ బీజేపీ గళం - విష్ణువర్ధన్ రెడ్డి సూటి ప్రశ్న 

మందుల సామేలు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఐదు కోట్ల మంది సోదర తెలుగు రాష్ట్ర ఆంధ్రులను అవమానించడం న్యాయమేనా?  వెంటనే జూబ్లీహిల్స్ వదిలి వెళ్లిపోవాలి అంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలపై ఇంత బహిరంగంగా బెదిరిస్తుంటే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చున్నారు. తెలంగాణ ప్రజలు అందరినీ ప్రేమించే గొప్ప సమాజం. మీ రాజకీయాల కోసం మంచి రాష్ట్రాన్ని నాశనం చేయడం ఎందుకని ప్రశ్నించారు. 

Continues below advertisement

అవసరం లేని వివాదంలో కాంగ్రెస్ 

వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ, సామేలు అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా మరోసారి హద్దులు దాటడంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పరంగా ఏపీతో సత్సంబంధాలు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుంటే, ఇలాంటి నేతల వ్యాఖ్యలు ఆ ప్రయత్నాలకు గండికొడుతున్నాయని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

 నెటిజన్ల ట్రోలింగ్ - సోషల్ మీడియాలో నిరసన 

సామేలు వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు,  టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడుతున్నారు. నాగేశ్వర్ వంటి మేధావుల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఈ ట్రోలింగ్ సెగ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌కు కూడా తాకడంతో, పార్టీ నష్ట నివారణ చర్యలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.     రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, అవి వ్యక్తిగత దూషణల స్థాయికి చేరినప్పుడు పార్టీలకు ఇబ్బందులు తప్పవు. మందుల సామేలు వంటి నేతలు  పార్టీ ప్రతిష్టను పణంగా పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.