Revanth Reddy NTR statue inauguration:   హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రివనం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన   నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు.  కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని చాలా మంది విమర్శిస్తున్నారని..  ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా నేను భయపడను, వెనక్కి తగ్గను  అని స్పష్టం చేశారు.  తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతను గౌరవించడం ఏ పార్టీకి పరిమితం కాదని, అది అందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. జాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ పి.వి. నరసింహారావు వంటి నాయకులను అందిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేశారని కొనియాడారు.

Continues below advertisement

 కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే! 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు.  నాడు ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ గానీ, లేదా ఇతర నేతలు గానీ ఈ స్థాయికి వచ్చేవాళ్లా?  అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అని, ఆయన నీడన బతికి ఈరోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ, ఆయన విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదా తక్కువ చేయడం వారి  నకిలీ  ఆలోచనలకు నిదర్శనమని రేవంత్ ఎద్దేవా చేశారు.

Continues below advertisement

 ఇందిరమ్మ ఇళ్లు - ఎన్టీఆర్ స్ఫూర్తి 

సంక్షేమ పథకాల విషయంలో ఎన్టీఆర్ దార్శనికతను రేవంత్ రెడ్డి ఆకాశానికెత్తారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన  పక్కా ఇళ్ల  పథకమే నేటి  ఇందిరమ్మ ఇళ్ల  పథకానికి పునాది అని ఆయన గర్వంగా ప్రకటించారు. పేదలకు గూడు కల్పించాలనే ఎన్టీఆర్ సంకల్పాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని, ఆ వారసత్వాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.

 విమర్శలకు తావులేదు - రేవంత్ స్పష్టత 

కాంగ్రెస్ వేదికలపై ఎన్టీఆర్ నామాన్ని జపించడంపై వస్తున్న రాజకీయ విమర్శలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ఒక వ్యవస్థ అని, ఆయన విగ్రహం అమీర్‌పేట వంటి  ప్రాంతంలో ఉండటం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్టీఆర్ వేసిన పునాదులను ఎవరూ విస్మరించలేరని, అలాంటి మహానుభావుడికి నివాళి అర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మైత్రివనం వద్ద జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కేవలం ఒక విగ్రహావిష్కరణలా కాకుండా, రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యానికి వేదికగా మారింది. ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటూనే, మరోవైపు కేసీఆర్ , బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఈ పరిణామం తెలుగుదేశం సానుభూతిపరులను కూడా కాంగ్రెస్ వైపు ఆలోచింపజేసేలా ఉందని  భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా  హాజరయ్యారు.