ఉమ్మడి రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీష్ రావు ఘాటుగా స్పందించారు. తెలంగాణను అవమానిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులు 1200 మందిని బలి తీసుకుంది బీజేపీయే ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి కులమతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా అన్ని ప్రాంతాలను సమభావంతో చూడాలని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అలా లేదని తెలంగాణ ఆక్షేపించారు. 1200 మందిని
ఒక ఓటు - రెండు రాష్ట్రాల తీర్మానం చేసింది గుర్తు లేదా ?: రేవంత్ రెడ్డి
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపు, వ్యతిరేక భావంతో మాట్లాడారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మోదీ " మోదీ మేనేజ్‌మెంట్ ద్వారా ఈ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రధాని కాలేదని " విమర్శించారు. మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో మభ్యపెట్టి ప్రధాన మంత్రి అయ్యారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని బీజేపీ కాకినాడ తీర్మానం చేసిందని రేవంత్ గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాడు కూడా సాక్షిగా ఉన్నారని.. ఎల్.కె.అద్వానీ నాయకత్వం ఉన్నప్పుడు ఆ తీర్మానం చేశారని.. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాలు గెలుచుకుందన్నారు. నాడు తెలంగాణలో నాలుగు స్థానాలు గెలిచినా ... 1999లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే తెలంగాణను మోసం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తీర్మానం అమలు చేసి ఉంటే 1200 మంది అమరులయ్యేవారు కాదు : రేవంత్ రెడ్డి
1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉండి మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కానీ తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణను అవమానించింది. చిన్నచూపు చూసింది. తెలంగాణ ప్రజలను మోసం చేసింది బీజేపీనేనన్నారు. 1998లో కాకినాడలో చేసిన తీర్మానాన్ని తుంగలో తొక్కింది. అనేక విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. బీజేపీ దానికి బాధ్యత వహించాలి. మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాకినాడ తీర్మానం అమలు చేసి ఉంటే 1200 మంది విద్యార్థులు ప్రాణం తీసుకోకపోయేవారు. వారి ప్రాణాలు తీసుకున్నది బీజేపీయే. ఇప్పటికైనా నరేంద్ర మోదీ క్షమాపణలు కోరాలన్నారు. కానీ ఈరోజు తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని అథమ స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇంత దిగజారి మాట్లాడిన ప్రధానిని ఈ దేశం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
బీజేపీ తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేవి కావు : హరీష్ రావు
ప్రధానమంత్రి మోదీ తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా అక్కసు వెళ్లగక్కుతారని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ బాగుపడుతుందని...కానీ మోడీకి నచ్చడం లేదన్నారు. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారు..నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారని ఆరోపించారు. సమాఖ్య స్పూర్తికి విరుద్ధంవా విభజన అని ఎలా అంటారని..ఏ స్ఫూర్తితో ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపారని ప్రశ్నించారు. 2004 లోనే తెలంగాణ ఇస్తే ఇంత మంది విద్యార్థులు అమరులు అయ్యేవారా.. శ్రీకాంత చారి లాంటి వారు బలిదానాలు ఇచ్చేవారా అని ప్రశ్నించారు. వందల ప్రాణాలు పోడానికి కారణం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలని విమర్శించారు. మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా మోడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచినట్లు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోడీ చేసేది అన్యాయం.. చెప్పేది శ్రీరంగ నీతులన్నారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయన్నారు.