IPS Sunil Kumar vs RRR Political Controversy : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐపీఎస్ అధికారి అన్న హోదాను పక్కనబెట్టి సునీల్ కుమార్ విసురుతున్న రాజకీయ సవాళ్లు, దానికి రఘురామ ఇస్తున్న కౌంటర్లతో ఇరుపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. మీ
రాజీనామా సవాళ్ల వెనుక అసలు స్ట్రాటజీ
గత ప్రభుత్వ హయాంలో రఘురామకృష్ణరాజు అరెస్ట్, ఆ తర్వాత జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవీ సునీల్ కుమార్.. ఇటీవల కాలంలో పూర్తిగా ఒక పొలిటికల్ లీడర్ అవతారమెత్తారు. రఘురామ గనుక తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి వస్తే.. ఆయనపై తాను పోటీ చేసి వేయి ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని సునీల్ కుమార్ విసిరిన సవాల్ తీవ్ర దుమారం రేపింది. అయితే రఘురామ ఇప్పుడు రాజీనామా చేయరని, ఒకవేళ చేసినా సునీల్ కుమార్ నేరుగా వచ్చి పోటీ చేయరని అందరికీ తెలిసిన సత్యమే. కానీ, రఘురామకృష్ణరాజు అనే ఒక పెద్ద లీడర్‌ను బూచి గా చూపిస్తూ.. ఆ వివాదం ద్వారా తన పొలిటికల్ ఇమేజ్‌ను పెంచుకోవడమే సునీల్ కుమార్ అసలు వ్యూహమని భావిస్తున్నారు.
నెలాఖరులో పీవీ సునీల్ రిటైర్మెంట్
ఈ వివాదంలో అత్యంత విచిత్రమైన, చట్టపరమైన తిరకాసు ఏమిటంటే.. పీవీ సునీల్ కుమార్ ఇంకా అధికారికంగా పోలీస్ సర్వీస్‌లోనే ఉన్నారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం ఒక ఐపీఎస్ అధికారి ఇలా ప్రత్యక్ష రాజకీయ సవాళ్లు విసరడం, ప్రెస్ మీట్లు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. అయితే, తాను సర్వీస్‌లో ఉన్నాననే విషయాన్ని కూడా పక్కనబెట్టి, నేరుగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామతో రాజకీయ సవాళ్లు చేస్తున్నారు. భీమవరం వేదికగా జరిగిన దళిత సామాజికవర్గాల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే.. త్వరలోనే రిటైర్ అయిన తర్వాత నేరుగా వైఎస్ఆర్‌సీపీలో చేరి రఘురామపై పోరాడతాననే బలమైన సంకేతాలను ఇస్తున్నారు.
అట్రాసిటీ అస్త్రం - దళిత సెంటిమెంట్ రాజకీయం
ఈ రాజకీయ వివాదానికి పీవీ సునీల్ కుమార్ దళిత సెంటిమెంట్‌ను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అంశాన్ని జోడించడం ద్వారా మైలేజ్ సాధించాలని చూస్తున్నారు. దళితుల రక్షణ కోసమే తాను నిలబడ్డానని, తాను సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు దాదాపు 4,000 ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఛార్జ్‌షీట్లు వేయించానని సునీల్ కుమార్ ప్రకటించుకున్నారు. రఘురామతో ఉన్న పాత గొడవను కేవలం వ్యక్తిగత కక్షగా కాకుండా.. దానిని దళిత వర్గాల ఆత్మగౌరవ పోరాటంగా మార్చడం ద్వారా వైఎస్ఆర్‌సీపీలో ఒక కీలకమైన దళిత ఫేస్ గా ప్రొజెక్ట్ అవ్వాలనేది ఆయన స్కెచ్. సునీల్ కుమార్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. భీమవరంలో జరిగింది మత సభ లేదా సామాజిక సభ కాదని, అది పక్కా వైసీపీ పార్టీ సభ అని రఘురామ ఎద్దేవా చేశారు. అసలు ఒక ఐపీఎస్ అధికారి 4,000 ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఛార్జ్‌షీట్లు ఎలా వేయిస్తారని, అది కోర్టులు , దర్యాప్తు అధికారుల పరిధిలోని అంశమని గుర్తుచేశారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న, సర్వీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న సునీల్ కుమార్‌పై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీలో ప్లేస్ కోసమే ఈ హైడ్రామానా?
రఘురామకృష్ణరాజు ఇటీవల రామాలయంతో పాటు చర్చి విషయంలోనూ వివాదాస్పదం అయ్యారు. ఆయనకు కౌంటర్ ఇచ్చే గట్టి నాయకుడి కోసం జగన్ చూస్తున్నారు. సరిగ్గా ఈ తరుణంలో కూటమిలో అత్యంత కీలకమైన రఘురామకృష్ణరాజును టార్గెట్ చేయడం ద్వారా జగన్ దృష్టిలో పడాలనేది సునీల్ కుమార్ ప్లాన్. కూటమి ప్రభుత్వంపై ఎంత గట్టిగా పోరాడితే.. వైసీపీలో అంతటి ప్రాధాన్యత దక్కుతుందనే ఆలోచనతోనే, రఘురామతో ఉన్న వివాదాన్ని తన భవిష్యత్తు పొలిటికల్ కెరీర్‌కు పెట్టుబడిగా మార్చుకోవడానికి సునీల్ కుమార్ సిద్ధమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయాల్లో ఒక పెద్ద లీడర్‌ను ఢీకొట్టడం ద్వారా రాత్రికి రాత్రే పాపులారిటీ తెచ్చుకోవాలనే పాత ఫార్ములాను పీవీ సునీల్ కుమార్ వాడుకుంటున్నారు. అయితే, ఖాకీ చొక్కా విప్పకముందే ఇలాంటి బహిరంగ రాజకీయ సవాళ్లు విసరడం ఆయన చుట్టూ మరిన్ని చట్టపరమైన చిక్కులను తెచ్చిపెట్టేలా ఉంది. మరి రఘురామకృష్ణరాజును బూచిగా చూపిస్తూ సునీల్ కుమార్ వేసుకుంటున్న ఈ పొలిటికల్ రూట్‌మ్యాప్ ఆయనను వైఎస్ఆర్‌సీపీలో ఏ స్థాయికి తీసుకెళ్తుందో వేచి చూడాలి.
