Chandrababu Naidu and Pawan Kalyan Local Poll Strategy: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఘనవిజయం తర్వాత కూటమి ప్రభుత్వం ఊపుమీద ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పైకి ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ కోలుకోకముందే దెబ్బకొట్టాలనే ఆలోచన కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేస్తూ రావడం వెనుక చంద్రబాబు పక్కా వ్యూహాత్మక, రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయి.   ఆలస్యానికి అసలు కారణం - సీట్ల పంపిణీ తిరకాసు 

Continues below advertisement

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరపకపోవడానికి ప్రధాన కారణం.. కూటమి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య కిందిస్థాయిలో ఇంకా ఒక పటిష్టమైన సీట్ల సర్దుబాటు ఫార్ములా  ఖరారు కాకపోవడమే. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పంపిణీ అంటే కేవలం కొన్ని వందల మందితో ముడిపడిన వ్యవహారం కాబట్టి అధిష్టానాలు కూర్చుని తేల్చగలిగాయి. కానీ, గ్రామ స్థాయికి వచ్చేసరికి వేలాది సర్పంచ్, వార్డు మెంబర్, వందలాది ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి. వీటికి మూడు పార్టీల నుంచి తీవ్రమైన పోటీ ఉండటం, ముందే ఒక అండర్‌స్టాండింగ్ లేకుండా ఎన్నికలకు వెళ్తే మిత్రపక్షాల మధ్య తీవ్ర గొడవలు జరుగుతాయని చంద్రబాబు నాయుడు ముందుగానే అంచనా వేశారు.

 కూటమి ఐక్యతకు ముప్పు రాకుండా జాగ్రత్త 

Continues below advertisement

గ్రామాల్లో దశాబ్దాలుగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు, పాత కక్షలు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. జనసేన బలంగా ఉన్న చోట టీడీపీ లీడర్లు, టీడీపీ కేడర్ ఎక్కువగా ఉన్న చోట జనసేన, బీజేపీ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలోకి దిగే ప్రమాదం ఉంది. ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు జరిగితే.. అది కిందిస్థాయిలో కూటమి ఐక్యతను నిలువునా దెబ్బతీస్తుందని, ఆ ప్రభావం రాబోయే ఐదేళ్ల ప్రభుత్వ మనుగడపై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, ఎంత ఆలస్యమైనా సరే.. ముందుగా గ్రౌండ్ లెవెల్‌లో అసమ్మతిని పూర్తిగా అణచివేసిన తర్వాతే నోటిఫికేషన్‌కు వెళ్లాలని బాబు డిసైడ్ అయ్యారు.

అస్త్రంగా  నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు 

ఈ సంక్లిష్టమైన సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. నేరుగా రాష్ట్ర స్థాయి నుండి కాకుండా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో  కూటమి సమన్వయ కమిటీలను  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లేదా ఇన్‌ఛార్జ్, జనసేన,  బీజేపీల ముఖ్య నేతలు సభ్యులుగా ఉంటారు. ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎక్కువ బలం ఉంది? గత ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉంది? అనే అంశాల ఆధారంగా ఈ కమిటీలు స్థానికంగానే సీట్ల పంచాయితీని తేల్చాల్సి ఉంటుంది.

 పవన్ కల్యాణ్‌తో కలిసి జాయింట్ రూట్‌మ్యాప్ 

స్థానిక ఎన్నికల విషయంలో డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ అభిప్రాయాలకు కూడా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. జనసేన కేడర్ ఆశలు దెబ్బతినకుండా, అదే సమయంలో టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుకు నష్టం జరగకుండా ఒక గౌరవప్రదమైన నిష్పత్తిలో  గ్రామాలను పంచుకునేలా జాయింట్ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గొడవలు సద్దుమణిగి, మిత్రపక్షాల అభ్యర్థుల పేర్లు ఏకగ్రీవంగానో లేదా ఒకే అభ్యర్థిగా ఖరారయ్యేలా ఈ సమన్వయ కమిటీలు పర్యవేక్షిస్తాయి.

 వైసీపీ కోలుకోకుండా దెబ్బకొట్టే వ్యూహం 

ఈ ఆలస్యం కేవలం కూటమి సర్దుబాటు కోసమే కాదు.. ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీని మరింత నైతికంగా దెబ్బతీయడానికి కూడా వాడుకుంటున్నారు  ప్రజాకర్షక నిర్ణయాలు పూర్తిగా జనాల్లోకి వెళ్లి, వైసీపీ కేడర్ పూర్తిగా డీమోరలైజ్ అయ్యే వరకు సమయం తీసుకోవడం కూడా ఇందులో భాగమే. కూటమిలో సయోధ్య కుదిరేసరికి.. అటు వైసీపీలో ఉన్న మిగిలిన కాస్తో కూస్తో లీడర్లు కూడా పార్టీ మారతారని లేదా పోటీకి దూరంగా ఉంటారని చంద్రబాబు స్కెచ్ వేశారు. రాజకీయాల్లో ‘హడావుడి కంటే నిలకడే ముఖ్యం’ అని నమ్మే చంద్రబాబు నాయుడు.. స్థానిక ఎన్నికల విషయంలో తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీల ద్వారా సీట్ల ఫార్ములాను విజయవంతంగా పూర్తి చేసి, కూటమిలో ఎలాంటి ఇగో క్లాషెస్   రాకుండా ఒకే తాటిపైకి తెచ్చిన తర్వాతే స్థానిక సమర శంఖాన్ని పూరించబోతున్నారు. బాబు వేసిన ఈ ముందస్తు వ్యూహం క్షేత్రస్థాయిలో కూటమిని క్లీన్ స్వీప్ వైపు తీసుకెళ్తుందో లేదో మున్ముందు చూడాలి.