Raghu Rama Krishna Raju | అమరావతి: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈసారి ఏపీ సీఎం చంద్రబాబుకు సీనియర్ నేత రఘురామ కంప్లైంట్ చేశారు. వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, వైసీపీ ప్రభుత్వంలో జగన్ హయాంలో తనపై జరిగిన కస్టడీయల్ హింసపై చర్య తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఐపీఎస్‌లు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సిఐడి అధికారి విజయపాల్, డాక్టర్ ప్రభావతి (గుంటూరు జీజీహెచ్)లపై రఘురామ ఫిర్యాదు చేయగా FIR నమోదు చేశారని తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీ అధికారి విజయ పాల్ కు ముందస్తు బెయిలు నిరాకరించారు. మరోవైపు పీవీ సునీల్ కుమార్ దర్యాప్తులో జోక్యం చేసుకుంటూ, బెదిరింపులకు పాల్పడు తున్నారని రఘురామ పేర్కొన్నారు. కనుక ఈ కేసులో నిందితులను తక్షణమే కస్టడీలోనికి తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదుపై స్పందించి తక్షణమే న్యాయం చేయాలని రఘురామ అభ్యర్థించారు.
మూడుసార్లు తనను లేపేయాలని చూశారన్న రఘురామ
‘గతంలో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. మాజీ సీఎం జగన్ కు మచ్చుకైనా మానవత్వం అంటూ లేదు. నన్ను దారుణంగా చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగకుండా మూడుసార్లు నన్ను పైకి పంపాలని చూశారు. అలాంటి జగన్ కు అప్పుడే మానవత్వం విలువ తెలిసొచ్చిందా. ఇంతకీ ఏం జరిగిందా. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నా, పటిష్టమైన భద్రత ఉన్నా ఎవరైనా తనను కాల్చివేస్తారేమోనని చెట్లు నరికించిన ఘనుడు జగన్. నాలుగన్నరేళ్లు నా నియోజకవర్గానికి సైతం రాకుండా నన్ను అడ్డుకున్నారు. ప్రధాని మోదీ వస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని చూస్తే ఆ ప్రయత్నం కూడా సఫలం కాకుండా చేశారు.
జగన్ నువ్వు ఎమ్మెల్యేవు. నువ్వు తిరుమల దర్శనానికి వెళ్తే నీతో పాటు మరికొందర్ని అనుమతిస్తారు. కానీ వందలు, వేల మందితో కలిసి వెళ్లాలని ప్లాన్ చేయడం ఏంటి? గతంలో తీసివేసిన రూల్ ను టీటీడీ ఈవో శ్యామలరావు తిరిగి పునరుద్ధరించారు. ఇలా ప్రభుత్వాలు సైతం ఎన్నో పాత నిర్ణయాలను అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు రూల్ పాటించకుండా రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు. నెయ్యి కల్తీపై ఎన్‌డీడీబీ టెస్టులు జరిపి నిజమేనని తేల్చింది. దీనిపై సైతం వైసీపీ రాద్ధాంతం చేస్తోంది. వేల ఆవుల పాలలో కల్తీ జరుగుతుందా? ఏఆర్ డెయిరీ పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి స్వామివారికి ఏ అపచారం జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లడ్డూ కల్తీ వివాదంపై ఏర్పాటు చేసిన సిట్ త్వరలోనే నిజాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించనుందని’ రఘురామ ఇటీవల కీలక విషయాలు ప్రస్తావించారు.
Also Read: LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు