Jan Suraaj Party Bihar Bypoll Contesting:  ఇంతకాలం తెరవెనుక ఉంటూ గొప్ప పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పేరు తెచ్చుకున్న  ప్రశాంత్ కిషోర్  జనసురాజ్ పార్టీ పెట్టి పెద్దగా సక్సెస్   కాలేదు. కానీ ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేదు.  కానీ  ఇప్పుడు తానే స్వయంగా ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దూకారు. ఆయన స్థాపించిన  జన సూరాజ్ పార్టీ కోర్ కమిటీ నిర్ణయం ప్రకారం.. బీహార్‌లోని అత్యంత హై-ప్రొఫైల్ అసెంబ్లీ స్థానమైన బాంకీపూర్   ఉపఎన్నికలో  ప్రశాంత్ కిషోర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై, ఇటీవల రాజ్యసభకు వెళ్లిన సీనియర్ నేత నితిన్ నబీన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి జూలై 30, 2026 న ఉపఎన్నిక జరగనుంది. గత ఏడాది జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయడానికి వెనుకడుగు వేసిన పీకే.. ఇప్పుడు ఏకంగా బీజేపీకి కంచుకోట  లాంటి స్థానంలో పోటీకి దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Continues below advertisement

తప్పనిసరిగా పోటీ చేస్తున్న పీకే 

 ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద రాజకీయ అనివార్యత దాగి ఉంది. గత 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో 238 స్థానాల్లో పోటీ చేసిన జన సూరాజ్ పార్టీ.. ఒక్క సీటులో కూడా గెలవలేక పూర్తిగా చాపచుట్టేసింది. ఈ ఘోర పరాజయం వల్ల పీకే సృష్టించిన పొలిటికల్ హైప్ ఒక్కసారిగా కరిగిపోయింది. పార్టీ ఉనికిని కాపాడుకోవాలన్నా, కేడర్‌లో తిరిగి ఉత్సాహం నింపాలన్నా తానే స్వయంగా యుద్ధరంగంలోకి రావాలని పీకే భావించారు. అందుకే, తదుపరి సార్వత్రిక పోరు దాకా ఆగకుండా, ఈ ఉపఎన్నికను తన రాజకీయ భవితవ్యానికి ఒక  యాసిడ్ టెస్ట్  గా మార్చుకున్నారు.  1990ల కాలం నుండి  గతంలో పట్నా వెస్ట్ గా ఉన్న ఈ నియోజకవర్గం బీజేపీకి అల్ట్రా-సేఫ్ సీటు. నితిన్ నబీన్ ఇక్కడి నుండి వరుసగా 5 సార్లు  ఎమ్మెల్యేగా గెలిచారు. పట్నా నగర పరిధిలోని అత్యంత ధనిక, విద్యావంతులైన ఓటర్లు ఉన్న ఈ  నియోజకవర్గంలో కమలం జెండాను కాదని వేరే పార్టీ గెలవడం దాదాపు అసాధ్యమనే టాక్ ఉంది.

Continues below advertisement

చదువుకున్న వారు ఓటేస్తారని పీకే ఆశ

అయితే, ఇంతటి కఠినమైన నియోజకవర్గాన్ని పీకే ఎంచుకోవడం వెనుక కూడా ఒక స్ట్రాటజిస్ట్ మైండ్ దాగి ఉంది. బాంకీపూర్‌లో బీహార్‌లోనే అత్యధికంగా అక్షరాస్యత రేటు ఉంది. ఇక్కడి ఓటర్లు కుల సమీకరణాల కంటే అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, విద్యార్హతలు చూసి ఓటు వేస్తారనే నమ్మకం పీకేకు ఉంది.  బాంకీపూర్ ప్రజలు బీహార్‌లోనే అత్యంత చైతన్యవంతులు.. సరైన ప్రత్యామ్నాయం దొరికితే వారు మార్పు కోరుకుంటారు అని పీకే ఓటర్లను నేరుగా ఆకర్షిస్తున్నారు. పైగా, ఈ ఎన్నికను బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఆర్నెల్ల పాలనపై ఒక  రెఫరెండం గా ఆయన అభివర్ణిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఓడిపోయినా  బీజేపీ కోటలో గట్టి ఫైట్ ఇచ్చాం  అని చెప్పుకోవచ్చు, పొరపాటున గెలిస్తే మాత్రం బీహార్ రాజకీయాల్లో జన సూరాజ్ తిరుగులేని శక్తీగా అవతరిస్తుంది.

పీకేకు కొన్ని వర్గాల సపోర్ట్ 

ప్రస్తుత గెలుపు అవకాశాలను అంచనా వేస్తే.. పీకేకు ఇది అత్యంత భారీ రిస్క్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో బీజేపీ ఓటు బ్యాంక్ ఇక్కడ చాలా పటిష్టంగా ఉంది. పీకే రాకతో కాంగ్రెస్ నాయకుడు రిషి మిశ్రా లాంటి వారు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ.. అధికారిక ప్రతిపక్షమైన ఆర్జేడీ  -కాంగ్రెస్ కూటమి మహాగఠ్‌బంధన్ ఇక్కడ సొంత అభ్యర్థిని నిలబెడితే ఓట్లు చీలిపోయి బీజేపీకి మరింత లాభం చేకూరుతుంది. పైగా బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్   కొత్తగా పెట్టిన జన్శక్తి జనతా దళ్ తరఫున సామాజిక కార్యకర్త వీణా మాన్విని బరిలోకి దించడం కమలదళానికి రూట్ క్లియర్ చేస్తోంది.

గెలిస్తే తిరుగుండదు! 

 ఆగస్టు 3న వచ్చే ఫలితాల్లో పీకే గనుక ఇక్కడ డిపాజిట్ కోల్పోతే.. కేవలం ఢిల్లీ ఏసీ రూముల్లో కూర్చుని స్క్రిప్టులు రాసే కార్పొరేట్ స్ట్రాటజిస్టే తప్ప, గ్రౌండ్ లెవెల్ లీడర్ కాదంటూ ప్రత్యర్థులు ఆయన్ను రాజకీయంగా సమాధి చేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా బీజేపీ మెజారిటీని భారీగా తగ్గించినా, లేదా అద్భుతం జరిగి గెలిచినా.. 2025 పరాభవానికి పీకే సరైన రివెంజ్ తీర్చుకున్నట్లవుతుంది. ఈ చావో రేవో పోరాటంలో పీకే మైండ్ గేమ్ గెలుస్తుందా, లేక కమలం కోట నిలుస్తుందా అనేది బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతోంది.