Social Media Abuse Control Politics: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో లభించిన చారిత్రాత్మక విజయంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తరుణంలో.. రాష్ట్ర రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా వ్యక్తిగత దూషణలు, శాంతిభద్రతల సవాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.  రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు రగిల్చేందుకు, శాంతిభద్రతల సమస్యలను   సృష్టించేందుకు ఒక పక్కా వ్యూహం ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు  టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  రాయలసీమలోని రాప్తాడు ఫ్యాక్షన్ సెగల నుంచి కోస్తాలోని పెనుమలూరు పొలిటికల్ వార్ దాకా.. గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం స్థానిక వివాదాలు కాదని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించేందుకు   ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. 

Continues below advertisement

పరిటాల సునీత, రవిపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన తోపుదుర్తి 

 రాయలసీమ సున్నిత ప్రాంతాల్లో పాత కక్షలను మళ్లీ రగల్చడం. ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు రెండేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హఠాత్తుగా తెరపైకి వచ్చి.. దివంగత నేత పరిటాల రవి, ప్రస్తుత మంత్రి పరిటాల సునీతలపై అత్యంత ఘోరమైన, వ్యక్తిగత పదజాలం ఉపయోగించడం జిల్లాలో సంచలనంగా మారింది. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న అనంతపురం లాంటి జిల్లాలో ఇలాంటి ఉద్రేకం రేపే ప్రసంగాలు చేయడం వెనుక.. ఎలాగైనా స్థానిక కేడర్‌ను ఘర్షణల్లోకి నెట్టాలనే కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. కూటమి శ్రేణులు గనుక సహనం కోల్పోయి ఎదురుదాడి చేస్తే..  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మాపై దాడులు జరుగుతున్నాయి అని దిల్లీ స్థాయిలో  విక్టిమ్ కార్డ్ ప్లే చేసే వ్యూహంతోనే తోపుదుర్తి ఇలా రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.  

Continues below advertisement

 పెనుమలూరు వివాదం, అమరావతి రాజకీయం

కృష్ణా జిల్లా కానూరు లో టీడీపీ జెండా దిమ్మెను ఉద్దేశపూర్వకంగా తొలగించిన వ్యవహారం దుమారం రేపింది.  అమరావతిలోనూ వైసీపీ నేతల పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. తమ నేతలపైనే దాడులు జరిగాయంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి రావడం ఈ పొలిటికల్ స్కెచ్‌లో భాగమేనని అంటున్నారు.  ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఇతర రాష్ట్రాల యూట్యూబర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ మహిళా నేతలపై అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం, విద్వేషాలను రేపడం పతాక స్థాయికి చేరింది. తాజాగా, దళిత క్రైస్తవ మీటింగుల ముసుగులో పవన్ కళ్యాణ్‌పై, రాజ్యాంగ వ్యవస్థలపై సాయుధ తిరుగుబాటును, నక్సల్స్ ఐడియాలజీని ప్రోత్సహిస్తూ వీడియోలు చేసిన వివాదాస్పద యూట్యూబర్  జోసెఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  పై గన్నవరం పోలీసులు కఠినమైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం  సంచలనంగా మారింది. 

ప్రభుత్వం గుర్తించిందా?

ఈ  అలజడి రాజకీయ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన  యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.  గత రెండేళ్లుగా కేవలం పరిపాలన, సంక్షేమంపైనే దృష్టి పెట్టి శాంతిభద్రతల విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించడం వల్లే  ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న  సీఎం చంద్రబాబు.. ఇప్పుడు హోం శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకుల ముసుగులో ఉన్నా సరే.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హయాంలో జరిగిన రాక్రీట్  అవినీతి అక్రమాలపై, ఆస్తుల సీజింగ్‌పై లీగల్ ఫోకస్ పెట్టడంతో పాటు.. సోషల్ మీడియా విద్వేషకులకు మద్దతుగా నిలుస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్, వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై లీగల్ నోటీసులు, అరెస్టుల పరంపర ప్రారంభం కానుందని భావిస్తున్నారు. 

పెట్టుబడులు, అభివృద్ధి కాదు.. ఇతర అంశాలే హైలెట్ 

ఏపీ రాజకీయాలు ఇప్పుడు కేవలం  అభివృద్ధి-సంక్షేమం  అనే చర్చల నుంచి మారి,  వ్యవస్థల పరిరక్షణ-శాంతిభద్రతల అదుపు  అనే దిశగా సాగుతున్నాయి. ప్రతిపక్షం ఎంతలా రెచ్చగొట్టినా.. కూటమి ప్రభుత్వం చట్టపరమైన ఆంక్షలు, ఉపా  లాంటి కఠిన నిబంధనల ద్వారా అరాచకాలను అణచివేసేందుకే మొగ్గు చూపుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే ఈ కఠిన చర్యలు అరాచక శక్తులకు అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని ప్రశాంత మార్గంలో ఉంచుతాయా.. లేక ప్రతిపక్షం మరింతగా సెంటిమెంట్ పాలిటిక్స్ తెరపైకి తెస్తుందా అనేది వేచి చూడాలి.