Prashant Kishor on congress: కాంగ్రెస్ పార్టీతో తాను మరోసారి కలిసి పనిచేసే అవకాశం లేదని, ఆ పార్టీతో కలిసి ఉంటే వాళ్లతో పాటు తాను కూడా నిండా మునిగిపోయే ఛాన్స్ ఉందన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ప్రశాంత్ కిశోర్.. గతంలో ఎన్నో రాష్ట్రాల్లో విజయం సాధించామని, కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి 2017 యూపీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు గుర్తుచేశారు. కనుక, ఆ పార్టీతో మరోసారి కలిసి పనిచేయనని స్పష్టం చేశారు.
చేతులు జోడించి దండం పెట్టిన ప్రశాంత్ కిశోర్..
కొన్ని వారాల కిందటి వరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని, ఆ పార్టీతో సైతం కలిసి పనిచేయనని.. కాంగ్రెస్ పార్టీకి దండం అంటూ చేతులు జోడించి నమస్కారం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డును దెబ్బతీసిందన్నారు. బిహార్లోని వైశాలి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. మేం చాలా ఎన్నికల్లో విజయం సాధించాం. 2015లో బిహార్‌లో మహాఘట్బంధన్ను గెలిపించుకున్నాం. 2016లో పంజాబ్ ఎన్నికల్లో గెలిచాం. 2019లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పనిచేసి విజయం సాధించాం. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో, ఆపై 2021లో జరిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విజయం సాధించాం.
2011 నుంచి 2021 మధ్య 11 ఎన్నికల్లో సక్సెస్ అయ్యాం. కానీ యూపీ ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూశాం. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాం. అక్కడ ఫలితాలు దారుణంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నా ట్రాక్ రికార్డును దెబ్బతీసింది. ఆ పార్టీతో కలిసి పనిచేస్తే నేను కూడా మునిగిపోతాను. అందుకే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నానని’ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి రఘువంవ్ ప్రసాద్ సింగ్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.