Minister Jogi Ramesh : తొడలు కొడితే, బూతులు తిడితే సామాజిక న్యాయం అవుతుందా? అని టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నిర్వహించి సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర విజయవంతమైందన్నారు. దాదాపు 16 జిల్లాల్లో జరిగిన యాత్రకు ప్రతి చోట ప్రజలు  ఆదరించారన్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ సామాజిక ధర్మం పాటించలేదని, ఏపీలో మాత్రమే సీఎం జగన్‌ సామాజిక న్యాయం పాటించారన్నారు. మూడేళ్లలోనే ఈ విధంగా సామాజిక న్యాయం అమలు చేయగలరా అని మేధావులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఆశ్చర్యపోతున్నారన్నారు. 


చంద్రబాబు మాయల ఫకీరు 


మహానాడు సాక్షిగా చంద్రబాబు నాయుడు ఒక మాయల ఫకీరులా అక్కడ కూర్చుని రెండు రోజుల పాటు తిట్ల పురాణం మొదలెట్టారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రభుత్వం మీద, సీఎం పైనా అడ్డగోలు విమర్శలు చేశారన్నారు. ఆ విధంగా తిట్టడం చూస్తే, అయ్యన్నపాత్రుడు మద్యం సేవించి వచ్చాడా అని అనిపించిందన్నారు. వారు అలా మాట్లాడినా చంద్రబాబు చూస్తూ కూర్చున్నారన్నారు. ఇంకా చెప్పాలంటే అలాంటి వారితో చంద్రబాబు మాట్లాడించారా అన్న అనుమానం వస్తుందన్నారు.


సీఎం జగన్ అభినవ ఫూలే 


ఇవాళ బీసీలు యావత్తూ టీడీపీకి దూరం అయ్యారని మంత్రి జోగి రమేష్ అన్నారు. అందరూ జగన్‌ వెంట నడవాలని నిర్ణయించారన్నారు. సీఎంను అభినవ పూలే అని కూడా అభివర్ణిస్తున్నారన్నారు. అన్ని నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారన్నారు. శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్‌తో పాటు, మంత్రివర్గంలో కూడా ఆ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం చేశారన్నారు. ఆ విధంగా సీఎం జగన్ సామాజిక న్యాయ నిర్మాత అయ్యారన్నారు. 2024లో జగన్‌ వన్స్‌మోర్‌ అంటే మళ్లీ జగనే కావాలి అని అందరూ చెబుతున్నారన్నారు. వాస్తవానికి బీసీలకు తాను ఏంచేశానన్నది కూడా చంద్రబాబు చెప్పలేకపోతున్నారని ఆరోపించారు. ఎందుకంటే ఆయన వారి కోసం ఏమీ చేయలేదన్నారు. ఈ విషయంపై చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలన్నారు. చంద్రబాబు ఏనాడైనా బీసీలు, ఎస్సీలకు రాజ్యసభ టికెట్‌ ఇచ్చి అవకాశం కల్పించారా? అని ప్రశ్నించారు. వర్ల రామయ్యకు రాజ్యసభ టికెట్‌ ఇస్తానని చెప్పి, మాట తప్పారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు.