Janasena Telangana strategy 2026: తెలంగాణ రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అడుగులు ఇప్పుడు సరికొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ఏపీలో అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, పవన్ ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో తన పార్టీ శ్రేణులతో జరిపే కీలక సమావేశం ద్వారా తెలంగాణలో జనసేన ఉనికిని చాటాలని ఆయన భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయానికి వెన్నెముకగా నిలిచిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తెలంగాణలో కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలకు, తన పార్టీని టార్గెట్ చేస్తున్న వారికి జూన్ 2 సమావేశం వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో జనసేన కేవలం నామమాత్రపు పార్టీ కాదని, నిర్ణయాత్మక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఆయన త్రిశూల్ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఇలాంటి సమయంలో జనసేన ఒంటరిగా లేదా వ్యూహాత్మకంగా పోటీ చేస్తే.. అదనంగా 4 నుంచి 5 శాతం ఓటింగ్ సాధించినా అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఏపీ సరిహద్దు జిల్లాల్లోనూ జనసేనకు బలమైన యువ ఓటు బ్యాంక్ ఉంది. ఈ 5 శాతం ఓట్లు ఎవరి ఖాతా నుంచి మళ్లుతాయి అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.
మున్నూరు కాపులు జనసేనకు అండగా ఉంటారా?
జనసేన పుంజుకుంటే అది ప్రధానంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. సెటిలర్ల ఓట్లు , యువత ఓట్లతో పాటు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు జనసేన వైపు మళ్లితే, స్వల్ప మెజారిటీతో గెలిచే స్థానాల్లో ఫలితాలు తలకిందులవుతాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఓట్లు మళ్లుతున్న తరుణంలో, పవన్ కళ్యాణ్ ప్రవేశం కాంగ్రెస్‌కు కూడా సవాలుగా మారనుంది. పవన్ తన ప్రసంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ,నిబద్ధత గురించి మాట్లాడుతుండటం యువతను అమితంగా ఆకర్షిస్తోంది.
జూన్ రెండో తేదీన తెలంగాణ నేతలకు రోడ్ మ్యాప్
గతంలో తెలంగాణ ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌కు పెరిగిన గ్రాఫ్ తెలంగాణలో కూడా ప్లస్ అవుతుందని పార్టీ భావిస్తోంది. జూన్ 2న జరిగే సమావేశంలో పవన్ తెలంగాణకు సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్ ప్రకటిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తనను టార్గెట్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు ఆయన స్టైల్ లో ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందోననే చర్చ సాగుతోంది.
బీజేపీతో ఉన్న మిత్రధర్మాన్ని కొనసాగిస్తూనే, తెలంగాణలో జనసేన స్వతంత్రంగా ఎదగాలని పవన్ ఆశిస్తున్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే, అది బీజేపీకి అదనపు బలాన్ని ఇస్తుంది. ఒకవేళ ఒంటరిగా వెళ్తే, ఓట్లను చీల్చడం ద్వారా కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఏది ఏమైనా, తెలంగాణ రాజకీయాల్లో 5 శాతం ఓట్లు అనేవి ప్రభుత్వాలను కూల్చడానికి లేదా నిలబెట్టడానికి సరిపోతాయి. ఈ లెక్కనే ఇప్పుడు రాజకీయ పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది.
