Janasena vs Intellectuals controversy:  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసుల విషయంలోలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సంఘీభావ సమావేశం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. నాగేశ్వర్‌కు మద్దతు తెలపాల్సిన వేదికపై, కొందరు వక్తలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లక్ష్యంగా వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ రంగు పులుముకుంది.    అభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారంటూ మొదలైన ఈ చర్చ, కొద్దిసేపటికే దారి తప్పింది. వేదికపై ఉన్న కొందరు వక్తలు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం , ఆయన తీరుపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయింది.  సంఘీభావ సభ కాస్తా పవన్ కల్యాణ్ టార్గెట్ సభగా మారిపోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   

Continues below advertisement

 

Continues below advertisement

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం 

ఈ పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌పై  కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యలు,  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ఏపీ బీజేపీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.   12 సంవత్సరాల తర్వాత కూడా ప్రాంతీయ భేదాలు, ప్రజల  సెంటిమెంట్ రెచ్చగొట్టడం దేనికి సంకేతం? ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు, ప్రాంతీయభావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఎలాంటి స్థానం లేదన్నారు.  ప్రొఫెసర్ నాగేశ్వర్ తన తప్పును తానే ఒప్పుకోవడం జరిగిందని గుర్తు చేశారు.  ప్రజా వేదికలపై మాట్లాడే ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 

 సోషల్ మీడియాలో యుద్ధం - జనసేన కౌంటర్ 

ప్రెస్ క్లబ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి.   పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించిన వారిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  పవన్ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన మేధావులను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 ఈ వివాదంపై మేధావి వర్గంలో కూడా చీలిక కనిపిస్తోంది. నాగేశ్వర్‌పై కేసులను ఖండించడంలో తప్పు లేదని, కానీ అదే సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతుందని కొందరు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు మధ్య ఉన్న గీతను మేధావులు గుర్తించకపోతే వారి విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.