Free Power To Farmers | హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ముంటే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఛాలెంజ్ చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
3 గంటల కరెంట్ చాలన్న వ్యక్తి రేవంత్ రెడ్డి..రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనంటూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు ముమ్మాటికి అబద్ధాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత కరెంట్‌ను పూర్తిగా ఎగగొట్టేందుకే రైతు డిస్కం పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతులపై అంతే ప్రేమ ఉందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్..'రైతు డిస్కం' అనేది రైతన్నల మెడకు ఉరితాడు లాంటిదని, దీని ద్వారా ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా రద్దు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, పారిశ్రామిక సెలవులతో (ఇండస్ట్రియల్ హాలిడేస్) రాష్ట్రం అతలాకుతలం అయిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఆ దుస్థితిని మార్చి, 79 ఏళ్ల భారత చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఏకైక నేతగా నిలిచారన్నారు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానంటున్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నల నోటికాడి కూడును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ రైతు వ్యతిరేక కుట్రలపై ప్రజలు కూడా స్పందించి రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.Also Read: Balka Suman Remand: బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
హైడ్రా భూతంతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు వచ్చి 6 వేల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించడంతో పాటు జీవో 58, 59 ద్వారా పేదలకు భూమి హక్కులు కల్పించామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా (HYDRAA) అనే భూతాన్ని తెచ్చి పేద ప్రజల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొడుతోందని, వారికి తీరని అన్యాయాన్ని చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
కంటోన్మెంట్‌లో డిఫెన్స్ భూముల బదలాయింపు కోసం, కరీంనగర్, నిజామాబాద్ వైపు స్కైవేల నిర్మాణం కోసం నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే నేడు ఆ పనులు సాకారమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ఆర్మీ అధికారులు అడ్డగోలుగా రోడ్లు మూసివేస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించింది తామేనన్నారు. దేశమంతా కాంగ్రెస్ అనే దరిద్రాన్ని తిరస్కరిస్తే, తెలంగాణలో మాత్రం అది మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికలు లేకపోయినప్పటికీ, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
