Janasena :  ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీని ఓడించడమే  జనసేన పార్టీ లక్ష్యమని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ను సాధిస్తామన్నారు.  ఈ మేరకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకుని అధికారికంగా తీర్మానం చేశారు.  ఈ విషయంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్నదాన్ని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యామ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని మరోసారి తెలిపారు. టీడీపీతో కలుస్తామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను పాటిస్తామని... ఎన్నికల సమయానికి ఉండే పరిస్థితులను బట్టి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటామన్నారు. తమ స్ట్రాటజీ తమకు ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ఏపీకి హానికరమని స్ఫష్టం చేశారు. 



పీఏసీ కమిటీ భేటీలో మొత్తం ఐదు తీర్మానాలు చేశారు. వైసీపీ విముక్త ఏపీ, అధికారానికి దూరంగా ఉన్న కులాలకు నిజమైన రాజకీయ సాధికారత,  వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ.. వెనుకబడ్డ ముస్లింల ఆర్థిక పరిపుష్టి , దివ్యాంగుల సంక్షేమం.. సామాజిక భరోసా జనసేన బాధ్యత మిగిలిన నాలుగు తీర్మానాలు.  2019 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా నమ్మారని పవన్‌ అన్నారు. ఈ దిశగా పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకునే ప్రక్రియను సెప్టెంబర్‌ నుంచి ప్రారంభింస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.


 జనసేన జీరో బడ్జెట్ అంటే అర్ధం వేరే విధంగా చేసుకుంటున్నారని.. ఎన్నికల సమయంలో కార్యకర్తలకు కనీసం టీ కూడా ఇప్పించడం లేదని చెప్పారు. మనం ఒక లక్ష్యంవైపు వెళ్తుంటే.. మరికొందరు వారి వారి స్థాయిలో కిందకు లాగడానికి చేస్తుంటారని చెప్పారు. పెట్టుబడికి అనుకూలంగా లేనంతకాలం రాయలసీమ వెనుకబడే ఉంటుందని చెప్పారు.సీమలో పరిశ్రమ పెట్టాలంటే స్థానిక నేతలకు కప్పం కట్టాలని..పరోక్షంగా వైసీపీ నాయకులను ఉద్దేశించి మండిపడ్డారు. కప్పం కట్టకుంటే కియా పరిశ్రమపై దాడి చేసినట్లు దాడి చేస్తారని విమర్శించారు. గొడవల మధ్య రాయలసీమలో అభివృద్ధి చెందడం లేదన్నారు. సీమ యువత అంతా ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్ వెళ్తోందన్నారు.


కడప జిల్లాకు వెళ్తున్నామంటే యాత్ర ఎలా సాగుతుందనే చర్చ జరిగిందని..రాయలసీమలోకి కోస్తా ప్రజలు అడుగు పెట్టలేరనే భయం ఉందని చెప్పారు. జాతీయ భావాలతో ఉన్న తమకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాయలసీమ ఎందుకు వెనకబడి ఉందో నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్‌సీపీ, టీడీపీకి కొమ్ము కాయబోమని.. మూడో ప్రత్యామ్నాయం కావాలని ఆయన  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న సమయంలోనే వైసీపీని ఓడించడమే లక్ష్యమని రాజకీయ తీర్మానం చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 


బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?