యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NT Rama Rao Jr)ను భారతీయ జనతా పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన అమిత్ షా (Amit Shah) సమావేశం అయ్యారు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చకు వచ్చింది? ఎన్టీఆర్‌కు బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్ ఏంటి? - ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ భేటీ హాట్ టాపిక్ అయ్యింది.


అమిత్ షా - బాద్ షా భేటీలో రాజకీయాలు లేవా?
'ఆర్ఆర్ఆర్' (RRR Movie) సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనబరిచిన అభినయం అమిత్ షాను అమితంగా ఆకట్టుకుందని, అందుకని నందమూరి హీరోను అభినందించడానికి కలిశారని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే... వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో అసలు రాజకీయాలు లేవా? అనే ప్రశ్న కొందరి మదిలో మొదలైంది. తెలంగాణలో కొమురం భీం అభిమానులు ఉన్నారు. ఆ పాత్రలో నటించిన ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకోవడం ద్వారా వాళ్ళను ఆకట్టుకోవాలనేది బీజేపీ ప్లాన్ అనేది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట.


ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న క్రేజ్‌ను కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవాలని కమల దళపతి ఆలోచిస్తున్నారని మరో టాక్. ఎన్టీఆర్‌ హీరోగా హిందుత్వ ఎజెండాతో కూడిన సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట.
 
రజాకార్ ఫైల్స్‌కు ఎన్టీఆర్ ఓకే చెబుతారా?
కశ్మీర్‌లో పండిట్లు, హిందువులు ఎదుర్కొన్న కష్టాలను 'ది కశ్మీర్ ఫైల్స్' వచ్చింది. ఆ చిత్రానికి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళుతున్న బీజేపీకి 'ది కశ్మీర్ ఫైల్స్' ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆ విధంగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. రజాకార్ల అకృత్యాలు, నిరంకుశ ధోరణి కళ్ళకు కట్టేలా చూపించడం కోసం 'ది రజాకార్ ఫైల్స్' సినిమా తీయనున్నట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ మధ్య వెల్లడించారు. అందులో హీరోగా నటించమని ఎన్టీఆర్ ముందుకు అమిత్ షా ప్రతిపాదన తీసుకొచారని బలంగా రాజకీయ వర్గాల్లో వినబడుతోంది.


కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. అయితే... 'ఆర్ఆర్ఆర్'లో భీం ఫిక్షనల్ క్యారెక్టర్. నిజ జీవితంలో రజాకార్లకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేశారు. అందువల్ల, 'రజాకార్ ఫైల్స్'లో ఆయన నటిస్తే... దేశవ్యాప్తంగా మైలేజ్ ఉంటుందని భారతీయ జనతా పార్టీ భావిస్తోందట. అందుకే, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్‌లో లేనప్పటికీ... తారక్‌ను ఎన్టీఆర్ కలవడం వెనుక కారణం ఇదే అంటున్నారు.


హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఏమంటారు?
రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.  కొన్నాళ్ళ క్రితం తెలంగాణలో సోదరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ఆయన ప్రచారానికి రాలేదు. సినిమాల పరంగానూ అందరివాడిగా ఎన్టీఆర్ ఉంటున్నారు. ఆయన అభిమానుల్లో అన్ని మతాలు, వర్గాల వారు ఉన్నారు. ఇప్పుడు 'రజాకార్ ఫైల్స్' చేయడం ద్వారా ఆయన కొందరికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. పైగా, ఆయన మీద హిందుత్వ ముద్ర పడొచ్చు కూడా! బీజేపీ మనిషి అంటే ఉత్తరాదిలో ఒక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. అందువల్ల, ఈ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఏమంటారు? అనే డిస్కషన్ కూడా జరుగుతోంది.


Also Read : సోషల్ మీడియాను ఊపేస్తున్న అమిత్‌ షా, జూనియర్ ఎన్టీఆర్ - ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌


ఎన్టీఆర్‌ను ఒప్పించే బాధ్యత విజయేంద్రప్రసాద్ తీసుకున్నారా?
ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే రాజమౌళి కుటుంబం భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉంటోంది. రాజకీయంగా రాజమౌళి ఎటువంటి ప్రకటనలు చేయనప్పటికీ... ఆయన తండ్రి, ప్రముఖ రచయిత వి విజయేంద్ర ప్రసాద్‌ను ఎంపీ చేసింది బీజేపీ పార్టీ. ఇటీవల ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో కథ రాసినట్టు ఆయన తెలిపారు. బీజేపీకి అండ దండ అయినటువంటి ఆర్ఎస్ఎస్‌తో విజయేంద్ర ప్రసాద్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ను 'రజాకార్ ఫైల్స్' చేసే విధంగా ఒప్పించే బాధ్యతను ఆయనకు అప్పగించారని మరో టాక్. అంతిమంగా ఎన్టీఆర్ ఏం నిర్ణయం తీసుకున్నారనేది చూడాలి.


Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?