స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అమెరికాలో సందడి చేస్తున్నారు. భారత 75 స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా అమెరికాలో నిర్వహించిన ఇండియా డే పరేడ్ కు ఆయన నేతృత్వం వహించారు. న్యూయార్క్ లో ఈ ర్యాలీ జరిగింది. ఈ వేడుకల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌, మన్‌హట్టన్‌ సహా పలు ప్రాంతాల్లో ఉండే భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలను చేతబూని నినాదాలు చేశారు.


‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.  హీరో అల్లు అర్జున్‌తో పాటు ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ సహా పలు సినిమా పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. గత నెలలోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నాలుగో పరేడ్ కౌన్సిల్ అల్లు అర్జున్ కు ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో ఆయన న్యూయార్క్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి పలువురు ప్రవాస భారతీయులు హాజరయ్యారు. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అల్లు అర్జున్  హిందీలో ప్రసంగించారు. ఆయన ‘పుష్ప’ సినిమాలోని పాపులర్ డైలాగ్ చెప్పారు. ‘‘యే భారత్‌ కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..’’ అంటూ ర్యాలీలో పాల్గొన్న జనాలను ఉర్రూతలూగించారు. భారతీయుడిగా జన్మించడం పట్ల గర్వపడుతున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తిమంతమైన దేశమన్నారు. ప్రతిష్ఠాత్మక ర్యాలీకి గ్రాండ్ మార్షల్‌గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.


కోవిడ్ కారణంగా గడిచిన మూడు సంవత్సరాలుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల వల్ల రెండు, మూడేళ్లుగా  గ్రాండ్‌ మార్షల్‌ ఇండియా డే పరేడ్‌ నిర్వహించట్లేదు. ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన నేపథ్యంలో గతంతో పోల్చితే ఈసారి మరింత ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు.  మన్‌హట్టన్‌లోని మ్యాడిసన్ అవెన్యూ మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. దీనికి గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ వ్యవహరించారు.  


అటు గ్రాండ్‌ మార్షల్‌గా వ్యవహిరించిన స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ కి అక్కడి మేయర్‌ ఆమమ్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ రికగ్నిషన్‌ అందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో కలిసి మేయర్ తగ్గేదే లే అనే డైలాగ్ చెప్పారు. అల్లు అర్జున్ మాదిరిగానే ఫోజు పెట్టారు. ఈ సందర్భంగా అల్లువారి అబ్బాయి మేయర్ కు ధన్యవాదాలు చెప్పారు.






సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప: ది రైజ్’తో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు. ఈ సినిమా విదేశాల్లో సైతం భారీగా వసూళ్లు సాధించింది. అమెరికాలో అత్యధికంగా కలెక్షన్లు సాధించింది. సుమారు రెండు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. ప్రస్తుతం పుష్ప: ది రూల్ను తెరకెక్కించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి. బన్నీ అమెరికా పర్యటన నుంచి రాగానే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.  


Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు


Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?