Kamal opposes One nation One election: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ఒకే దేశం- ఒకే ఎన్నికల నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుండగా.. విపక్ష పార్టీలు మాత్రం ఆ మోడల్‌ను తప్పు పడుతున్నాయి. ఇప్పటికే ఈ విధానం అమలు ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపగా.. కేంద్ర మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఖురేషీ కూడా ఈ విధానం సరికాదన్నారు. మక్కల్‌ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్‌ కూడా కేంద్రం ఆలోచన దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టే చర్యగా పేర్కొన్నారు.


ఒకే దేశం ఒకే ఎన్నికలు.. ఒకేసారి ట్రాఫిక్ సిగ్నల్స్‌ అన్నీ గ్రీన్‌లోకి రావడంతో సమానం:


ఒకే దేశం- ఒకే ఎన్నికలు విధానం అత్యంత ప్రమాదకరమని.. అదిపూర్తిగా తప్పుడు ఆలోచనా దోరణితో చేస్తున్న పని అని కమల్‌హాసన్‌ దుయ్యబట్టారు. ఈ తరహా విధానం కారణంగా విజయవంతమైన దేశం లేదని.. ఫలానా దేశం విఫలమైందని ఉదాహరణగా చెప్పని కమల్‌.. ఇప్పటికీ ఆయా దేశాలు ఆ తరహా ఎన్నికల ఫలితాలను భరిస్తూనే ఉన్నాయని అన్నారు. భారత దేశానికి ఇప్పుడు కానీ భవిష్యత్‌లో కానీ ఈ తరహా ఎన్నికల విధానం సరికాదని అభిప్రాయ పడ్డారు. తమ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏ పార్టీ కానీ వ్యక్తి పేరు కానీ తీయకుండా 2014, 2015 నాటి ఎన్నికల గురించి విమర్శలు చేశారు. 2014, 2015 ఎన్నికల్లో కొందరు కంప్లీట్ స్వీప్ చేసి గెలిచి డిక్టేటర్‌షిప్‌, ఏకవ్యక్తి పాలనను తీసుకొచ్చారని కమల్‌ ఆరోపించారు.


భావ ప్రకటన స్వేచ్ఛ హరించారు


ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా హరించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే మనం దాని నుంచి తప్పించుకున్నామని.. కరోనా వైరస్‌కంటే ప్రమాదకరమైన ఆ వైరస్‌ నుంచి తాము బయటపడ్డడామని గుర్తించాలన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానం అన్నది.. ట్రాఫిక్‌ సిగ్నల్స్ దగ్గర అన్ని సిగ్నల్స్ ఒకేసారి గ్రీన్‌లోకి రావడంతో సమానమని.. ఎవరూ ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని కమల్ అన్నారు. ప్రజలకు వారు ఎవరు కావాలో ఆలోచించుకొని ఎంచుకొనే అవకాశం ఉండితీరాలన్నారు. బిగ్‌బాస్‌ షో చేయడం సహా రాజకీయాల్లోకి రావొద్దని ఎంతో మంది సలహా ఇచ్చారన్న ఆయన.. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకోవడంలో వచ్చిన అన్ని అవకాశాలు వినియోగించుకోవడంలో తప్పేముందని తాను అభిప్రాయపడ్డారు.


ఒక సినిమా ఆడకపోతే ప్రొడ్యూసర్లు హీరోని పక్కన పెడతారేమో కానీ ప్రజలు అలా కాదని.. రాజకీయాల్లో విఫలమైన వాళ్లను కూడా వాళ్లు గుర్తు పెట్టుకుంటారని కమల్ చెప్పారు. తనని తాను ఒక విఫల పొలిటీషియన్‌గా చెప్పుకొన్న కమల్.. ప్రధాని సీటు కూడా పర్మినెంట్ కాదన్నారు. మన దేశానికి నెహ్రూ, గాంధీ, అంబేడ్కర్‌ వంటి గొప్ప వ్యక్తులు చాలా శక్తిమంతమైన ప్రజాస్వామ్య సౌధాన్ని ఇచ్చారని.. వాటిని తప్పుడు విధానాలతో కూలదోయకుండా ఉంటే చాలని అన్నారు. 2024 సార్వత్రికంలో కమల్‌ పార్టీ మక్కల్ నీది మయ్యం.. అధికార డీఎంకేతో అలయన్స్‌గా ఎన్నికల్లోకి వెళ్లింది.  2025లో మక్కల్ నీది మయ్యం పార్టీకి డీఎంకే ఒక రాజ్యసభ సీటు కేటాయించనుంది.


            విపక్ష పార్టీలు ఎన్ని విధాలుగా అపోజ్ చేస్తున్నా.. తమ ఎన్నికల హామీల్లో ఒకటైన ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యాచరణను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ముందుకు తీసుకెళ్లోంది.
Also Read: Tirumala Laddu Row: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవంలో తిరుమల లడ్డూల పంపిణీ, అందులోనూ కొవ్వు నెయ్యినే వాడారా?