Tirumala Laddu Row: అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రతువుకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వైష్ణవ భక్తులు సహా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ తిరుమల నుంచి తెప్పించిన పరప పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని పంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపు 300 కిలోల లడ్డూని ఈ వేడుకకు పంపించగా.. ఆ మొత్తం ప్రసాదాన్ని భక్తులకు పంచారు. ఇప్పుడు తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలడంతో.. ఆ నాటి లడ్డుల పరిస్థితి ఏందన్న ఆందోళనలు వైష్ణవ సంఘాల్లో నెలకొన్నాయి.
లడ్డూల్లో యానిఫల్ ఫ్యాట్స్ అవశేషాలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోరిన అయోధ్య ఆలయ పూజారి:
జనవరి 22 నాటి ఆలయ ప్రారంభోత్సవంలో పంచిన లడ్డూల్లో కూడా యానిమల్ ఫ్యాట్ అవశేషాలు ఉంటే ఏంటి పరిస్థితి అని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అవసరం అని ఆయన డిమాండ్ చేశారు. నాడు 300 కిలోల లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసిన సత్యేంద్ర దాస్.. వైష్ణవులు సాదారణంగా వెల్లుల్లి, అల్లం ఉన్న వాటినే తీసుకోరని అలాంటిది యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డులను వారికి ప్రసాదంగా ఇవ్వడమంటే అది మహా తప్పిదమే అవుతుందని, క్షమించరాని నేరమన్నారు. ఇది పూర్తి హిందూ వ్యవస్థనే అవమానించడంగా పరిగణిస్తామన్న ఆయన.. పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలవగా.. మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ.. గుజరాత్ NDDC ఇచ్చిన నివేదికను బయట పెట్టడంతో పెను దుమారమే రేగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఆరా తీసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. నివేదిక కోరారు. అధికారుల నుంచి కూడా నివేదిక తెప్పించుకొని దానిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంద రోజుల్లో పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ నాటకానికి తెర తీశారంటూ వైకాపా విమర్శిస్తోంది.
నెయ్యిలో జంతునూనెల అవశేషాలు గుర్తించామన్న టీటీడీ ఈఓ:
కొద్ది నెలల క్రితమే లడ్డు నాణ్యతపై భక్తులు చేస్తున్న విమర్శల మీద నలుగురు సభ్యుల కమిటీ వేసి వారు చేసిన సూచనల మేరకు తమిళనాడుకు చెందిన ఒక నెయ్యి సరఫరా సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఈఓ శ్యామలారావు తెలిపారు. ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లసు తెలిపారు. నెయ్యిలో యానిమల్ ప్యాట్స్ ఉన్న విషయం నిజమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో తదుపరి చర్యలకు ఉపక్రమించే ముందు ఈఓను ముఖ్యమంత్రి కార్యాలయంకి రావాల్సిందిగా అధికారులు సమాచారం ఇచ్చారు. అటు.. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి ఆధారాలతో బయట పెట్టారని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి శోభ కరంద్లాజే నాటి ముఖ్యమంత్రిగా జగన్ తీరుపై తీవ్రమైన విమర్శలు కూడా గుప్పించారు. జగన్ మాత్రం.. ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ఘటనలో బాధ్యుడ్ని చేస్తూ తిట్టిపోయాలని శుక్రవారం నాటి ప్రెస్ మీట్‌లో కోరారు.