Sharmila Meet Sivakumar  : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకేకు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో  డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  


అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?


రాజకీయంగా తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని షర్మిల ఇటీవల స్వయంగా ప్రకటించారు.  తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించాయి. షర్మిల, డీకేఎస్ భేటీ ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోందని తెలిపాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ తో విభేదాలను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరేందుకు డీకే శివకుమార్ ను షర్మిల కలిసి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తోంది.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా షర్మిల ఓ సారి డీకే శివకుమార్ ను కలిశారు. కర్ణాటకలో శివకుమార్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదని ఆయనే కష్టపడికాంగ్రెస్ పార్టీని గెలిపించారని కితాబునిచ్చారు. ఇలా మొదటి సారి సమావేశం జరిగినప్పుడు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం. ..లేకపోతే పొత్తులు పెట్టుకోవడంపై చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. కానీ విలీనం చేసే ప్రశ్నే లేదని షర్మిల తేల్చి చెప్పారు. పొత్తుల కోసం చాలా పార్టీల నుంచి మస్డ్ కాల్స్ వస్తున్నాయని.. సరైన సమయంలో నిర్ణయం  తీసుకుంటామని చెప్పారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ కు సన్నిహితులు. దీంతో  పొత్తుల అంశంపై రెండు పార్టీల మధ్య డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.                    


ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్


అయితే షర్మిల పార్టీని విలీనం చేసుకోవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందని.. అందు కోసం ఆమెకు ఏపీలో నాయకత్వం ఆఫర్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్  టీపీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని.. అదే ఏపీలో అయితే.. పార్టీని పూర్వ స్థితికి తీసుకు రావొచ్చని నచ్చ చెబుతున్నట్లగా చెబుతున్నారు. సోదరుడు జగన్ తో ఎలాగూ సంబంధాలు లేనందున..సొంత రాజకీయ భవిష్యత్ చూసుకుంటున్నందున.. ఇక రాజకీయంగా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోందని అంటున్నారు. వరుసగా సమావేశాలు జరుగుతున్నాయంటే ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.