NTR centenary celebrations :. యన్టీఆర్ తెలుగుదేశం స్ధాపించినపుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చదువుకున్న బిసి, దళిత యవకులకు వేదిక కల్పించారు. అప్పటి యువకులలో చాలా మంది నలభై సంవత్సరాల తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారంటే అప్పుడు తెలుగుదేశం వేసిన పునాది ఎంత బలమైనదో అర్దంచేసుకోవచ్చు. ఇవికాక అప్పటి సమాజంలో పీడక, దోపిడీ వ్యవస్థలుగా పేరు పడిన పటేల్, పట్వారీ, కరణం వంటి వాటిని రద్దు చేస్తూ, మరింత పారదర్శకమైన మండల వ్యవస్థలను ప్రవేశ పెట్టి పల్లెలను ఆధిపత్య వర్గాల గుప్పెట నుండి విడిపించి, బలహీన వర్గాలకు చేరువ చేసారు.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు
స్ధానిక సంస్థల్లో 35% బిసిలకు రిజర్వేషన్లు పెట్టి బిసిలలో పెద్ద ఎత్తున గ్రామస్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేసారు. ఆయన ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల పధకం ద్వారా పేదలు ఆకలిని అధిగమిస్తే, గురుకుల పాఠశాల ద్వారా నాణ్యమైన చదువులు అందుకోగలిగారు. ఈనాడు బడుగు, బలహీన వర్గాలు విధ్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ఎదిగడానికి తెలుగుదేశం తెచ్చిన మార్పు ఒక వేయి రీసెర్చి సబ్జెక్టులకు సరిపోయే అంశం. ఇంత ప్రగతి సాదించినా ఇప్పటికీ ముఖ్యపీఠం మాత్రం ఆ వర్గాలకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన క్రమంలో ముందుగా ఆంధ్ర రాజకీయాలు చూస్తే అక్కడ కేవలం రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే చట్టసభలో ఉన్నాయి.
బీసీలకు అధికారం..
రాజకీయ రంగంలో బీసీ వర్గాల వారిని బలంగా ప్రోత్సహించిన ఎన్టీఆర్.. వారికి స్ధానిక సంస్ధల్లో మొదటిసారి రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్రం నలుమూలలా బీసీ వర్గాల్లో రాజకీయ నాయకత్వం పెరగడానికి ఆ చర్య ఎంతగానో దోహదపడింది. విద్యా సంస్ధలు, ఉద్యోగాల్లో తొలిసారి ఆయన మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు తీసివేసి ఒక హార్స్ పవర్‌కు ఏడాదికి ఏభై రూపాయలు చెల్లించే శ్లాబ్ పద్దతిని ఆయన ప్రవేశపెట్టారు. దీనివల్ల వ్యవసాయ రంగంలో మోటార్ల వాడకం పెరిగి సాగు విస్తీర్ణం పెరిగింది. పేదలకు పింఛను పథకం కూడా ఆయన హయాంలోనే రూపుదిద్దుకొంది.
పాలనా సంస్కరణలు..
తాలూకాలు, సమితుల స్ధానంలో ఎన్టీఆర్‌తీసుకువచ్చిన మండల వ్యవస్ధ పాలనను ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చింది. తెలంగాణలో గ్రామీణ ప్రజలకు నిరంకుశత్వాన్ని రుచి చూపించిన పటేల్, పట్వారీ వ్యవస్ధను ఆయన రద్దు చేశారు. భూరికార్డులను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. దీనిని ఆదర్శంగా తీసుకొని తర్వాత దేశవ్యాప్తంగా ఈ హక్కును మహిళలకు కల్పించారు. కళాశాలలకు వెళ్లలేని వారి కోసం ఆయన నెలకొల్పిన దూర విద్య వర్సిటీ.. జాతీయ స్ధాయిలో అటువంటి వర్సిటీ ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచింది.