TDP Leaders: రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు అట్టహాసంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మహానాడులో పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
160 సీట్లతో టీడీపీ గెలుపు: అచ్చెన్నాయుడు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లను గెల్చుకుని అధికారం చేపడుతుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది ఎప్పుడూ ప్రజాపక్షమేనని పేర్కొన్నారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారని అచ్చెన్న అన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దాంతో సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అప్పట్లో తెలుగు దేశాన్ని ఎదుర్కోలేక జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామా, సొంత బాబాయిని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ ను వేటాడి, వెంటాడి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. 151 స్థానాలతోనే సీఎం జగన్ కళ్లు నెత్తికెక్కి, ఒళ్లు మెదమెక్కిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
'దోపిడీ దొంగకు ఓట్లేసి సీఎంను చేయడం చాలా పెద్ద తప్పు'
1982 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదని, 2019లో దురదృష్టవశాత్తూ ఏపీ ప్రజలు ఏమరపాటుతో తప్పు చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఓ కొత్త వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి సేవ చేస్తానంటే నమ్మడంలో అర్థం ఉందని, కానీ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసి, 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన ఓ దోపిడీ దొంగను సీఎంను చేయడం చాలా పెద్ద తప్పని అది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు.
'రేపోమాపో హత్య కేసు జగన్ మెడకు చుట్టుకుంటుంది'
ఒకవైపు 5 కోట్ల మంది ప్రజల వ్యతిరేకత, మరోవైపు తరుముకొస్తున్న బాబాయ్ హత్య కేసుతో జగన్ మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రేపోమాపో వివేకా హత్య కేసు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటుందని అన్నారు. ఈ విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని, అదే నిన్న సీబీఐ కోర్టులో చెప్పిందని తెలిపారు. సీబీఐ అడుగు ముందుకేస్తే తన కథ ముగుస్తుందన్న ఆందోళన ముఖ్యమంత్రికి నిద్రలేని రాత్రుళ్లు మిగులుస్తోందని మండిపడ్డారు.
క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు: కాసాని జ్ఞానేశ్వర్
క్రమశిక్షణకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. హైదరాబాద్ ను అదే క్రమశిక్షణతో అభివృద్ధి చేసి దేశంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఘనత చంద్రబాబుదేనని పేర్కొన్నారు. ఇటు ఏపీలో, అటు తెలంగాణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ఎలాంటి వార్తలు ప్రసారం చేయలేకపోతోందని, అలా వారిని భయపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో మీడియాకు స్వేచ్ఛ ఉండేదని, దేని గురించి అయినా పేపర్లో వస్తే మరోసారి రాకుండా పనులు పూర్తి చేసేవారని కాసాని పేర్కొన్నారు.
Also Read: TDP Manifesto: ఈసారి సంక్షేమం- అభివృద్ది ప్లస్, రేపే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో: చంద్రబాబు
రేపటి మహానాడులో బాబు ఎన్నికల సందేశం: సోమిరెడ్డి
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ హింసకి సింబల్‌గా మారిపోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అతిపెద్ద నేరపరిశోధన సంస్థ అయిన సీబీఐ.. ఏపీలో నిందితుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి ఏం అడ్డం వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఈ హత్యా రాజకీయాలకు సెంటర్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న పవన్ కళ్యాణ్ కామెంట్లతో జగన్ కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు కడతారా అని ప్రశ్నించారు. వైసీపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేపటి మహానాడులో చంద్రబాబు ఎన్నికల సందేశం ఇవ్వబోతున్నారని సోమిరెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని ఎలా కాపాడుకోవాలో చంద్రబాబు తన ప్రసంగంలో వివరిస్తారని చెప్పారు.