Chandrababu At Mahanadu 2023: రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడే.. చరిత్రను తిరగరాసే రోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా తిరిగి రాష్ట్రాన్ని కాపాడటానికి, దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం తీసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఈసారి జరిగే మహానాడు చాలా ప్రత్యేకమని బాబు అన్నారు. ఎన్టీ. రామారావు శతజయంతి ఉత్సవాల వేళ జరుగుతున్న ఈ పసుపు పండగకు విశిష్టత ఉందని తెలిపారు. ఎన్నడూ చూడని ఉరకలేసే  ఉత్సాహాన్ని ఈ మహానాడులో చూస్తున్నట్లు పేర్కొన్నారు. మామూలుగా కొద్దిగా సహకరించినా.. టీడీపీ శ్రేణులం ముందుకు వెళ్తామని, అడ్డం వస్తే మాత్రం తొక్కుకుంటూ పోతామని అన్నారు చంద్రబాబు.


'ఎన్టీఆర్ మెచ్చిన నగరం రాజమహేంద్రవరం'


తెలుగు జాతి యొక్క సంస్కృతి, సాంప్రదాయాల వైభవం రాజమహేంద్రవరమని టీడీపీ చీఫ్ అన్నారు. రాజమండ్రిగా ఉన్న పేరును రాజమహేంద్రవరంగా గోదావరి పుష్కరాల వేళ టీడీపీ హయాంలో నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. గొప్ప కవి నన్నయ, ఆధునిక కాల గొప్ప సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం, సర్ ఆర్దార్ కాటన్ కూడా రాజమహేంద్రవరంలో నివసించారు. తెలుగు నేలకు నీటి సౌకర్యం కల్పించి ఇక్కడి వారి మనసులు గెలుచుకున్నారు. విదేశీయుడు అయినా తన విగ్రహం పెట్టుకుని గౌరవించుకున్నామని చెప్పుకొచ్చారు బాబు. అలాంటి గడ్డపై మహానాడును నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు.


'నాలుగేళ్లు టీడీపీ శ్రేణులు ఎన్నో త్యాగాలు చేశారు'


నాలుగేళ్లు టీడీపీ శ్రేణులు ఎన్నో త్యాగాలు చేశారని బాబు అన్నారు. 'టీడీపీ శ్రేణుల త్యాగాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తప్పుడు కేసులు పెట్టారు. జైళ్లలో పెట్టారు. బయటకు రానీయకుండా అడ్డుపడ్డారు. జీవో నంబర్ 1 తీసుకొచ్చారు. నాయకులను అరెస్టు చేశారు. కానీ టీడీపీ శ్రేణులది ఉక్కు సంకల్పం. మాచర్ల నియోజకవర్గంలో దళిత కులానికి చెందిన చంద్రయ్యను చంపే ముందు కూడా జై జగన్ అను వదిలిపెడతామని అన్నారు.. అయినా ఆయన మాత్రం జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు. అలాంటి వ్యక్తి ఓ ఆదర్శం. అందుకే ఆయన పాడి మోశాను. టీడీపీ కుటుంబసభ్యులు చేసిన త్యాగాలను జీవితాంతం ఎప్పటికీ మర్చిపోలేను. అండగా ఉంటా.. తోడుగా ఉంటా.. మిమ్మల్ని పైకి తీసుకొస్తా.. ఏ కష్టం వచ్చినా చంద్రన్నా మీకు అండగా ఉంటాడని కుటుంబ పెద్దగా హామీ ఇస్తున్నా.  అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, టీడీపీ కార్యకర్తల సంక్షేమమే, అభివృద్ధే ప్రధానంగా ముందుకు తీసుకెళ్తా' అని చంద్రబాబు అన్నారు.