Mahanadu 2023 News: రాజమండ్రి వేమగిరి వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన మహానాడు కార్యక్రమం సర్వాంగ సుంద‌రంగా, అంగరంగ వైభవంగా, కనీవినీ ఎరుగని రీతిలో ముస్తాబు చేసింది టీడీపీ. ఈసారి ప్రతినిధుల సభ, బహిరంగ సభ వేర్వేరుగా ఏర్పాటు చేశారు. మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ నుంచి ముఖ్యనాయకులు, ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల సభకు 15,000 మందిని ఆహ్వానించారు. ఆదివారం జరిగే భారీ బహిరంగ సభకు 15 లక్షల మంది జనం వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న టీడీపీ 
41 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగుదేశం నిర్వహిస్తున్న 32వ మహానాడు ఇది. రాజమండ్రిలో మహానాడు సందర్భంగా భారీ సభ నిర్వహిస్తే తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుందని టీడీపీ లీడర్లు సెంటిమెంట్‌గా ఫాలో అవుతున్నారు. 1993లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ప్రజాగర్జన పేరుతో సభ నిర్వహించారు. ఆ సభకు భారీగా జనం వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2006లో మహానాడు నిర్వహించినా కేవలం ప్రతినిధుల సభ మాత్రమే జరిపారు. ఈ సారి రెండింటినీ నిర్వహిస్తున్నారు. 



 


మహానాడు ఎలా ప్రారంభమైంది
1982 పార్టీ ఆవిర్భావం సందర్భంగా తొలి మహానాడును హైదరాబాద్‌లో నిర్వహించారు ఎన్టీఆర్. తర్వాత 1986, 1987,1990, 91,92,93,94,1998, 99, 2004,2005, 20009, 2010, 2011, 2012, 13, 14,15 సంవత్సరాల్లో మహానాడుకు హైదరాబాదే వేదికైంది. విజయవాడలో 1983, 1988, 2000 సంవత్సరాల్లో మహానాడు నిర్వహించారు. 1984, 2001, 2017, 2018లో విశాఖలో ఉత్సవాలు జరిపారు. 2002లో వరంగల్‌, 2003, 2007, 2016లో తిరుపతిలో 2006 రాజమండ్రిలో సమావేశాలు జరిగాయి. కరోనా ప్రభావంతో 2020, 21లో ఆన్‌లైన్‌లో మహానాడు జరిపారు. 2022 ఏడాది మహానాడుకు ఒంగోలు వేదికైంది. వివిధ కారణాలతో తొమ్మిదేళ్లపాటు మహానాడు జరుపలేకపోయారు.


మహానాడులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు


ఎన్టీఆర్‌ శత జయంతి కావడంతో ఈసారి మహానాడును బారీగా ప్లాన్ చేసింది టీడీపీ. సమావేశాల కోసం 55 ఎకరాల్లో వేడుక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. పదిహేన వేల మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుంటుంది. వేదికపై మూడు వందల మందికిపైగా కూర్చోవచ్చు. 


మొదటి రోజు ప్రతినిధుల సభ ఉంటుంది. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూల మాల వేసి నివాళి అర్పిస్తారు. ప్రతినిధుల సభ రిజిస్టర్‌లో సంతకం చేస్తారు. అనంతరం మిగతా నాయకులు ఆయన్ని అనుసరిస్తారు. తొలి రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. రెండో రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. మొదటి రోజు జరిగే ప్రతినిధి సభకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పార్టీ లీడర్లు హాజరుకానున్నారు. యాభై వేల మంది కార్యకర్తలు కూడా వస్తారని పార్టీ అంచనా వేస్తోంది.


ఏడాది కాలంలో మరణించిన పార్టీ నేతలకు సంతాప తీర్మానం, పార్టీ జమా ఖర్చుల నివేదిక, ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రతినిధుల ముందు పెడతారు. తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఉపన్యాసం ఉంటుంది. 


రెండో రోజు భారీ బహిరంగ సభ జరగనుంది దీనికి లక్షల్లో జనం వస్తారని టీడీపీ లీడర్లు చెబుతున్నారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ఆ దిశగానే ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు భారీ జనసందోహం తరలిరావడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం నింపింది. ఇప్పుడు అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నారు.