టీడీపీ మహానాడు రెండు రోజుల కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.. రాజమండ్రి సిటీకు దూరంగా కడియం మండలం వేమగిరికి అత్యంత సమీపంలో ప్రతినిధుల సభ, దానికి ఆపోజిట్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సర్వం సన్నద్ధం చేశారు. రాజమండ్రికి సుదూర ప్రాంతంలో మహానాడు సభ అయితే ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు అసలు వేడంతా రాజమండ్రి సిటీలో రాజుకుంటోంది.. మహానాడు సందర్భంగా టీడీపీ ఇప్పటికే రాజమండ్రి సిటీ అంతా భారీ స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, టీడీపీ జెండాలతో తోరణాలు కడితే వైసీపీ నుంచి కూడా చాలా చోట్ల దండి మార్చ్‌ పేరుతో రాజమండ్రి ఎంపీ భరత్‌రామ్‌ ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి.


అంతేకాదు.. రాజమండ్రి సిటీలో ఉన్న ప్రధాన సెంటర్లలో ఉన్న భారీ హోర్డింగ్‌ల్లో రాజమండ్రి అభివృద్ధిని తెలుపుతూ ఎంపీ భరత్‌ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్స్‌లు దర్శనమిస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఎంపీ భరత్‌ ఇంటికి సమీపంలో ప్రధాన రోడ్డు మార్గం అంతా టీడీపీ స్వాగత ద్వారాలు, భారీ ఫ్లెక్సీలు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ మహానాడు కేంద్రంగా అధికార పార్టీకి, టీడీపీకు ఫ్లెక్సీల వార్‌ నడుస్తోన్నట్లు కనిపిస్తోంది. 


రాజమండ్రి అంతా పసుపు మయం.. 
రాజమండ్రి సిటీతోపాటు రూరల్‌ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు టీడీపీ జెండాలు కట్టడం పసుపు మయంగా మారింది. వేమగిరి బ్రిడ్జి నుంచి మహానాడు సభా వేదిక వరకు స్వర్గీయ ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేష్‌, ఇతర ముఖ్య నాయకులతో పాటు స్థానిక నేత, రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పొడవునా ఎక్కడ చూసినా రాజమండ్రి పరిసర ప్రాంతాలు అన్నీ పసుపు మయం అయ్యాయి. 


రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు, లోకేష్‌
శనివారం ముఖ్యనాయకులు, ప్రతినిధుల సభ జరగనుండగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు రాజమండ్రి శుక్రవారం సాయంత్రానికే చేరుకున్నారు. ఆయన స్థానిక మంజీర హోటల్‌కు చేరుకుని అక్కడే పొలీట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడినుంచి ప్రతినిధుల సభకు వచ్చి రాత్రి అక్కడే ఉండిపోయి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సభ కోసం ఇప్పటికే వేమగిరి వద్ద 20 ఎకరాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ఇక్కడే బసచేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు ప్రతినిధుల సభావేదికకు ఆపోజిట్‌లో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గననున్నారు.యువగళంలో పాల్గంటున్న జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ శుక్రవారం రాత్రికి రాజమండ్రి చేరుకోనున్నారు. 


ఫ్లెక్సీలు తొలగిస్తున్నారంటూ ఆరోపణ..
రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసుకుంటున్న ఫ్లెక్సీలు, ఇతర బ్యానర్లను, తోరణాలను వైసీపీ బ్లేడ్‌ బ్యాచ్‌ కోసివేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గురువారం రాత్రి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేసిన పలు బ్యానర్లనుగుర్తుతెలియని వ్యక్తులు బ్లేడ్లుతో కోసివేశారని మండిపడ్డారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. 


పటిష్టమైన బందోబస్తు..
రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తూర్పుగోదావరి ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహానాడు రెండో రోజు భారీ బహిరంగ సభకు దాదాపు 15 లక్షలమంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేయనున్న నేపథ్యంలో ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, కాకినాడ ఎస్పీల సారద్యంలో పోలీసులుకు విధులు కేటాయించారు.