TDP Mahanadu: రాజమహేంద్రవరం వద్ద వేమగిరిలో తెలుగుదేశం పార్టీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ నేతలు, కార్యకర్తలతు భారీగా తరలివచ్చారు. టీడీపీ శ్రేణులతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాధారణ కార్యకర్తల నుండి సీనియర్ నాయకుల వరకు మహానాడు జోష్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీ. రామారావు శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈ సారి మహానాడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది టీడీపీ నాయకత్వం. రెండ్రోజుల పాటు జరిగే మహానాడు కోసం కళ్లు చెదిరే భారీ ఏర్పాట్లు చేశారు. 


చిత్తూరు ప్రతినిధిగా చంద్రబాబు 


టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు ప్రాంగణానికి చేరుకుని చిత్తూరు జిల్లా కౌంటర్ లో ప్రతినిధిగా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహానాడును చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను కూడా బాబు ప్రారంభించారు. ఇక మహానాడు ప్రాంగణం అంతా కార్యకర్తలు, అభిమానుల రాకతో కళకళలాడుతోంది. ఇంకోవైపు పార్టీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో నగరం అంతా పసుపు మయంగా మారింది.


గుంటూరు ప్రతినిధిగా లోకేష్




మహానాడు ప్రాంగణానికి నారా లోకేష్ చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. లోకేష్ రాకతో మహానాడు ప్రాంతం అంతా సందడిగా మారింది. మహానాడు ప్రాంగణానికి వస్తూ పార్టీ ప్రతినిధులకు అభివాదం చేస్తూ.. అందర్నీ పలకరించుకుంటూ లోకేష్ స్టేజీపైకి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు కార్యక్రమం దగ్గర ఘంటా శ్రీనివాస్.. లోకేష్ ఒకరినొకరు పలకరించుకున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు లోకేష్ తో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. పాదయాత్రతో మంచి జోష్ వచ్చిందని టీడీపీ శ్రేణులు లోకేష్ కు తెలియజేశారు. గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్ట్రర్ లో లోకేష్ తన పేరు నమోదు చేసుకున్నారు. 




అచ్చెన్న ప్రశ్నల వర్షం 


ఏడాది కాలంలో చనిపోయిన టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు. అనంతరం మాట్లాడిన పార్టీ ఏపీ  అధ్యక్షుడు అచ్చెన్న... జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్సలు చేశారు. సీఎం జగన్ పచ్చి మోసగాడని ధ్వజమెత్తారు. అబద్దాల కోరు అని ఆరోపించారు. దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం పేద అరుపులు అరుస్తున్నాడని విమర్శించారు. జగన్ అఫిడవిట్‌లో ఏముందో చెప్పగలవా అని సవాల్ చేశారు. దోపిడీదారుడైన జగన్ వద్ద 510 కోట్లు ఉన్నాయని తెలిపారు అచ్చెన్న. 




2004లో ఇల్లు తాకట్టు పెట్టిన వ్యక్తికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయా చెప్పాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. ఊరుకో బంగ్లా ఉన్న జగన్ పేదవాడా అని నిలదీశారు. పులివెందుల, ఇడుపులపాయ, లోటస్‌ పాండ్, అమరావతి, చెన్నై, బెంగళూరులో ఉన్న వాటి గురించి చెప్పాలన్నారు.