TDP Manifesto: సంక్షేమం, అభివృద్ధి ప్లస్సే తెలుగు దేశం పార్టీ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా రేపు(మే 28 ఆదివారం) మొదటి ఎన్నికల మేనిఫెస్టో ఫేజ్ -1ను విడుదల చేస్తామన్నారు. ప్రజలు మెచ్చేదిగా, భవిష్యత్తుకు ఆదర్శంగా ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. 


'ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది'


తెలంగాణలో చేసిన పనుల వల్ల, టీడీపీ వేసిన ఫౌండేషన్ వల్ల ఆ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ హయాంలో చేసిన విధ్వంసం వల్ల ఏపీ చివరికి వెళ్లే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. 'మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత, అన్ని రాష్ట్రాలతో సమానంగా, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకటీ, రెండూ స్థానాల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఆ శక్తి, సత్తా తెలుగుదేశానికి ఉంది.  రేపు రాజమహేంద్రవరం దద్దరిల్లిపోతుంది. రాష్ట్రంలోని అన్ని చూపులు రాజమహేంద్రవరం వైపే ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది' అని బాబు అన్నారు. 






'మొదటి ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అదరగొడదాం'


'పేదల సంక్షేమానికి ఏం చేయాలో, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో ప్రణాళికలు తయారు చేద్దాం. మొదటి ఎన్నికల మేనిఫెస్టో రేపు విడుదల చేద్దాం. దాంతోనే అదరగొడదాం. నిరంతరం సంపద సృష్టిద్దాం.. ఆ సంపదను పేదవాళ్లకు పంచి పెడదాం. పేదవాడు ధనికుడు కావాలన్నా ఆశయాన్ని అందరం కలిసి చేద్దాం. జగన్.. తానొక్కడే ధనికుడిగా ఉండాలని అనుకుంటారు, మిగిలిన వాళ్లంతా పేదవాళ్లుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రజలు ధనికులుగా ఉండన్నాలదే నా సంకల్పం. దాని కోసం అందరం కలిసి పని చేద్దాం. తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల రుణం రాబోయే రోజుల్లో తీర్చుకుంటా. ఎన్నికలు 2024లో వచ్చినా అంతకు ముందే వచ్చినా మేం సిద్ధం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 






'కౌరవులను వధించి అసెంబ్లీని గౌరవ సభ చేస్తాం'


ప్రజలతో అనుసంధానం కావాలని, పేద వారితో మమేకం కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రను కూడా విజయవంతం చేస్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల పనితనాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అజాగ్రత్త పనికిరాదని సూచించారు. నౌ ఆర్ నెవర్ అనేలా.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా అనేది ప్రధానమన్నారు. ఈ రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యతను అందరం తీసుకోవాలని బాబు పిలుపునిచ్చారు.  కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను వధించి, అసెంబ్లీని గౌరవ సభ చేస్తామని అప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లబోనని మరోసారి చెప్పుకొచ్చారు. 






'నాలుగేళ్లలో రూ.2.47 లక్షల కోట్ల అవినీతి'


వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రూ.2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఏపీలో సంపద దోడిపీ ఎక్కువ, ధరల బాదుడు ఎక్కువ అని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని, జగన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, కోడికత్తి డ్రామా, మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్లు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లు వేయిచుకున్నారని బాబు విమర్శించారు. రూ. 2వేల నోట్లు అన్నీ జగన్ దగ్గరే ఉన్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసని, అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టిందే టీడీపీ అని గుర్తు చేశారు. 






'ప్రభుత్వ స్పాన్సర్ టెర్రరిజం పెరిగింది'


అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదని చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ స్పాన్సర్ టెర్రరిజం పెరిగిందని ఆరోపించారు. పెట్టుబడులు లేవని, జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదని అన్నారు. పుట్టబోయే బిడ్డపైనా అప్పులు వేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.