Karnataka CM Swearing-In: ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచి యుద్ధసన్నాహాల్లో మునిగిపోయాయి ప్రధాన పార్టీలు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఢీ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మొన్నటి వరకు లీడర్ బోర్డుపై ఎవరికి వారే మొదటి స్థానంలో ఉన్నామంటూ ప్రకటించుకున్నారు కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 


మొన్నటి వరకు అసలు రేసులోనే లేదు అనుకున్న కాంగ్రెస్ ఒక్కసారిగా లీడింగ్ పొజిషన్‌కు వచ్చేసింది. అధికారంలో ఉన్న బీజేపీని పడగొట్టి కర్ణాటకలో భారీ మెజారిటీతో గెలుపొందడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. అందుకే కాంగ్రెస్‌కు స్నేహ హస్తం ఇచ్చేందుకు చాలా పార్టీలు మందుకు వస్తున్నాయి. 


కర్ణాటక వేదికగా
నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ మొదలు డీఎంకే నేతలు స్టాలిన్ వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 2014 నుంచి వరుస ఎన్నికల పరాజయాలను ఎదుర్కొంటున్నందున, బీజేపీకి వ్యతిరేకంగా మెగా కూటమిని ఏర్పాటు చేయడం సమస్యాత్మకంగా మారింది.


ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ కర్ణాటక శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖీగా తలపడడంతో దేశం దృష్టి ఈ ఎన్నికల వైపు మళ్లింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రం ప్రధాని మోదీ మాత్రమే కాబట్టి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర్ణాటకలో ముమ్మరంగా ప్రచారం చేశారు.


హోరాహోరీగా సాగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార పార్టీ బీజేపీ 66 సీట్లు గెలుచుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ విజయం ప్రతిపక్షాలకు పెద్ద బూస్ట్‌గా మారింది.


ప్రతిపక్షాల ఐక్యత దిశగా కదలిక


విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కర్నాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఒక కార్యక్రమంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.


డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా అగ్రనాయకులందర్నీ ఆహ్వానించారు.


ఈ ఆహ్వానాన్ని మన్నిస్తూ ఎం.కె.స్టాలిన్, శరత్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు కాకాలి ఘోష్ దస్తీదార్ పాల్గొంటారు.


కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో విపక్ష నేతలు పాల్గొనడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ వ్యాఖ్యానిస్తూ.. ‘ఈ ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు నాంది కావచ్చు అని కామెంట్ చేశారు. 


ఈ సభకు వచ్చే వాళ్ల మధ్య భవిష్యత్‌లో మరిన్ని భేటీలు జరగవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే బీజేపీపై సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ నాయకత్నానికి విపక్షాలు మద్దతు పలికే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు 


Also Read: క్యాస్ట్ ఈక్వేషన్స్‌లో కర్ణాటక కాంగ్రెస్ నిలబడుతుందా! తడబడుతుందా?


Also Read: ఆ తప్పులన్నీ కప్పి పుచ్చుకునేందుకు ఇదే సింగిల్ ట్రిక్ - రూ.2 వేల నోటు రద్దుపై స్టాలిన్ కౌంటర్