Nellore News : నెల్లూరు సిటీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇటీవల కాలంలో మాజీ మంత్రి అనిల్ కి దూరంగా ఉంటున్న ఆయన బాబాయి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొత్త ఆఫీస్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ నెల్లూరులో ఆయన అనిల్ ఆఫీస్ గా ఉన్న రాజన్న భవన్ కే వెళ్లేవారు. ఇటీవల వీరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. దీంతో రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడు జగనన్న భవన్ అనే కొత్త ఆఫీస్ ప్రారంభిస్తున్నారు. దీనికి శంకుస్థాపన జరిగింది. అనిల్ ని వ్యతిరేకిస్తున్న 11 మంది కార్పొరేటర్లు రూప్ కుమార్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చారు. 


రూప్ కుమార్ తిరుగుబాటు జెండా! 


అనిల్, రూప్ కుమార్ మధ్య ఉన్న రాజకీయాలతో పెద్ద నాయకులెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విభేదాలలో తలదూర్చడం ఇష్టం లేక జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి ఇతర ఎమ్మెల్యేలెవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. అనిల్ కి దూరంగా వేరుకుంపటి పెట్టే విషయంలో చాన్నాళ్లపాటు తర్జన భర్జన పడిన రూప్ కుమార్ ఎట్టకేలకు జగనన్న భవన్ అనే ఆఫీస్ తో తిరుగుబాటు జెండా ఎగరేసినట్టయింది. భూమిపూజ కార్యక్రమంలో అనిల్ ప్రస్తావనే లేకుండా తాను చెప్పాల్సింది మీడియాకి చెప్పి ప్రసంగం ముగించారు రూప్ కుమార్. 


మాజీ మంత్రి అనిల్ నెల్లూరులో వెన్నుపోటు రాజకీయాలంటూ సీరియస్ కామెంట్లు చేశారు. ఇప్పుడా కామెంట్లు మళ్లీ వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి ఇరు వర్గాలు ఒకరి గురించి మరొకరు స్పందించడానికి ఇష్టపడటంలేదు. అయితే స్థానిక టీడీపీ నేతలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.  


అనిల్ కుమార్ ను ఒంటరి చేశారా? 


నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈరాజకీయాల్లో మాజీ మంత్రి అనిల్ ఒంటరైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమని సాక్షాత్తూ అనిల్ మాటల్లోనే తేటతెల్లమవుతోంది. పేర్లు చెప్పలేదు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు నెల్లూరులో వైరి వర్గాలతో టచ్ లో ఉన్నారని అంటున్నారు అనిల్. అందరూ కలసి రాత్రుళ్లు ఫోన్ రాజకీయాలు చేస్తున్నారని, తనని టార్గెట్ చేస్తున్నారని, అయినా డోంట్ కేర్ అంటున్నారు. ఇంతకీ అనిల్ ఆగ్రహం ఎవరిపై..? అనిల్ ని ఇబ్బంది పెడుతోంది ఎవరు..? అసలు అనిల్ తో ఎవరికి గొడవలున్నాయి. 


టార్గెట్ అనిల్? 


మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ కలకలం రేపారు. నెల్లూరు రాజకీయాల్లో స్వపక్షం, విపక్షం అన్నీ కలసిపోయాయంటున్నారు. రాత్రికి వైసీపీ నేతలతో వైరి వర్గాలు టచ్ లోకి వస్తున్నాయని, తనని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు దండుకుంటున్నారని, ఒకరు 10వేల రూపాయల బ్యాచ్ అయితే, ఇంకొకరు లక్ష రూపాయల కాస్ట్ లీ బ్యాచ్ అంటూ విమర్శిస్తున్నారు. అయితే అనిల్ వ్యాఖ్యలు వైసీపీ నేతల్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. తనకి వ్యతిరేకంగా తన పార్టీలోనే కుట్ర జరుగుతోందని పరోక్షంగా ప్రస్తావించారాయన. రాత్రయితే తమ పార్టీ ఎమ్మెల్యేలతోనే కొంతమంది గూడుపుఠాణీ సాగిస్తున్నారనేది అనిల్ ఆరోపణ. ఆమధ్య పార్టీలో వెన్నుపోటుదారులున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అనిల్. తాజాగా మరోసారి తన ఆవేదన ఇలా వెలిబుచ్చారు. ఇంతకీ సొంతపార్టీలో అనిల్ కి వెన్నుపోటు పోడుస్తున్న ఆ నేతలెవరు...? వైరి వర్గంతో టచ్ లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు..? అనేది తేలాల్సి ఉంది. 


Also Read : AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు


Also Read : Nellore Police : నెల్లూరు పోలీసులపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశాలు