Nellore Police : ఇటీవల నెల్లూరు జిల్లా పోలీసుల వ్యవహారం పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇందులో ఒకటి వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెం గ్రామంలో జరిగిన ఘటన. గుడ్లూరివారి పాలెంకు చెందిన  మైలారి పెంచలయ్య ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పెంచల్యయ భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తిని కాకుండా పెంచలయ్య కుటుంబ సభ్యులనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ప్రధాన అభియోగం. ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని అంటున్నారు. 


అసలేంటి కథ..?


గుడ్లూరువారిపాలెంకు చెందిన మైలారి పెంచలయ్య గతవారం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు వచ్చారు. ఆయన ఉరేసుకుని చనిపోయారని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులకు భార్యపై ఆనుమానం వచ్చింది. భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 


అజయ్ ఎవరు..?


పెంచలయ్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అజయ్ అనే వ్యక్తి హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు అనుమానిస్తూ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అజయ్ ని ఈ కేసునుంచి తప్పించారని, అతను పరారైపోయేందుకు సహకరించారని అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎస్సీ కమిషన్ వద్దకు వెళ్లింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గుడ్లూరువారి పాలేనికి వచ్చి పెంచల్లయ భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ కేసులో అజయ్ అనే వ్యక్తిని విడిచిపెట్టి, మరొకరిని ముద్దాయిగా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపామని ముద్దాయికి సహకరించిన పోలీసును వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పెంచలయ్య భార్యను బాధితురాలిగా పేర్కొంటూ ఆమెకు వెంటనే పరిహారం అందిచాలని సూచించారు. 


ఈ కేసును తక్షణమే హత్య కేసుగా నమోదు చేయాలని డీఎస్పీకి సూచించారు. అయితే  పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరవాత చేస్తామని డీఎస్పీ హరనాథ్‌ రెడ్డి ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వివరించారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు కట్టి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరవాత మిగిలినవి నమోదు చేయాలన్నారు చైర్మన్ విక్టర్ ప్రసాద్. హతుడి భార్యకు ప్రభుత్వం తొలివిడత రావాల్సిన నగదు రూ.4,12,500 నగదుతోపాటు, ఆర్నెళ్లకు సరిపడా నిత్యావసరాలు అందజేయాలని ఆదేశించారు. హంతకుడిని తప్పించేందుకు ప్రయత్నించిన సీఐతో పాటు మహిళా కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఈ కేసు మొదటి నుంచీ గందరగోళంగా ఉండటంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. 


Also Read : దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం చేయండి - ప్రభుత్వానికి ఏపీ బీజేపీ విజ్ఞప్తి !