భారతీయ జనతాపార్టీ లో చేరబోతున్నారని ( BJP ) జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( MP Komati Reddy ) స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తుదిశ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఆయన మరో ఎంపీ, టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ( Revanth Reddy ) కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ఒకే ఇంట్లోనే ఎన్నో గొడవలు ఉంటాయని.. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండటం సహజమన్నారు. బీజేపీ,టీఆర్ఎస్లలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ గొడవలున్నాయన్నారు.
ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ( PM Modi ) కలిశారు. ఆయనకు అపాయింట్మెంట్ ఇప్పించడంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలకంగా పని చేశారని.. త్వరలో ఆయనను కమలం గూటికి చేరుస్తారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో కోమటిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( Rajagopal Reddy ) కాంగ్రెస్‌లో తాను ఉండబోవడం లేదని ప్రకటించారు. గౌరవం లేని చోట ఉండలేనని ప్రకటించారు. దీంతో సోదరులిద్దరూ కలిసి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. గతంలో పలుమార్లు బీజేపీని పొగిడిన రాజగోపాల్ రెడ్డి తాను ఆ పార్టీలో చేరుతానని ప్రకటించారు కూడా. అయితే తాను అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను కలిశానని రాజకీయాలకు సంబంధం లేదన్నారు. తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( Munugodu MLA ) అభిప్రాయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలన్నారు.
‘ముత్యాలముగ్గు’లో హీరోయిన్లా నా పరిస్థితి, రేవంత్ రెడ్డే విలన్ : జగ్గారెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పదవి ఆశించారు. అయితే ఆ పదవిని హైకమాండ్ రేవంత్ రెడ్డికి అప్పగించింది. దీంతో కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే తర్వాత సైలెంటయ్యారు. ఇటీవల రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. కోమటిరెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. అనూహ్యంగా ప్రదానిని కోమటిరెడ్డి కలవడంతో బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు తుది శ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే ( Congress ) ఉంటానని కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.