Mamata Invites Jagan : రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చించేందుకు నిర్వహించేందుకు బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. అయితే తమకు ఆహ్వానం అందలేదని వైఎస్ఆర్‌సీపీ చెబుతూ వస్తోంది. ఢిల్లీలో విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారు. కానీ అదంతా అబద్దమని తాజాగా వెల్లడయింది. ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పాటు సీఎం జగన్‌కూ మమతా బెనర్జీ లేఖ రాశారు. సమావేశానికి రావాలని ఆహ్వానించారు. లేఖతో పాటు ఫోన్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే తాము హాజరు కాబోమని జగన్ నేరుగానే మమతా బెనర్జీకి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. అదే సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై విపక్షాలు సమావేశం అవడంతో జాతీయ మీడియా విజయసాయిరెడ్డిని సమావేశానికి వెళ్తున్నారా అని ప్రశ్నించింది. తమకు ఆహ్వానం లేదని ఆయన చెప్పారు.
అయితే వైఎస్ఆర్‌సీపీ ఆహ్వానం ఉన్నా లేదని ఎందుకు ప్రచారం చేసుకుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతివ్వడానికి సిద్ధపడినందునే.. విపక్షాల భేటీకి హాజరయ్యే విషయంలో జగన్ వెనుకడుగు వేసినట్లుగా చెబుతున్నారు. అయితే అసలు ఆహ్వానమే రాలేదన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది మాత్రం వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు కూడా అర్థం కాని విషయం. తమకు ఆహ్వానం వచ్చిందని తిరస్కరించామని చెబితే కొత్తగా పోయేదేముంటుందని అంటున్నారు.
ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్ఆర్‌సీపీ మద్దతివ్వడం ఖాయమని.. ఆ మేరకు ఇటీవల జగన్ ఢిల్లీ పర్యటనలో మోదీకి హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే రాష్ట్రానికి కావాల్సిన .. రావాల్సిన డిమాండ్లను ప్రధాని ముందు పెట్టి ఆ మేరకు సాధించుకుని వచ్చి మద్దతివ్వాలన్న డిమాండ్లు ఏపీలో వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ ఉండదని.. ఎన్డీఏకే మద్దతుగా ఉంటామని తాజా పరిణామం ద్వారా వైఎస్ఆర్‌సీపీ చెప్పినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.