భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ సింగరేణి విషయంలో మరో యుద్ధం ప్రకటించింది. సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అలాంటి ఆలోచన చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.
బొగ్గు గనుల వేలం ఆపాలి ! : కేటీఆర్
సింగరేణిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6, శ్రవనపల్లీ ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించలేదు. వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటను ఇస్తున్న ఏకైక సంస్ధ సింగరేణి అని కేటీఆర్ తెలిపారు. లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని కేటీఆర్ లేఖలో ఆరోపించారు.
కోల్ మైన్ కాదు గోల్డ్ మైన్ ! ! : కేటీఆర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు. ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. తక్షణం వేలం ఆపాలన్నారు.
దమ్ముంటే సింగరేణిపై శ్వేతపత్రం ఇవ్వాలి : బీజేపీ
కేటీఆర్ లేఖపై బీజేపీ మంండిపడింది. చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై శ్వేత పత్రం విడుదల చేసి.. సింగరేణి పరిస్థితి, అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని కేసీఆర్ దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. త్వరలో సింగరేణి ఎన్నికలు రాబోతుండటంతోనే టీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల వేలంపై సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తన్నారని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ విమర్శించారు. లాభాల్లో ఉన్న సంస్థను దివాళా తీయించి జీతాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే స్థితికి సింగరేణిని చేర్చిన విషయం నిజం కాదా అని బీజేపీ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే... అందులో 22 వేల ఉద్యోగాలను కోత విధించి.... కేవలం 40 వేల మంది కార్మికులకే పరిమితం చేశారన్నారు. బొగ్గు గనుల వేలం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ అని గతంలో ఒరిస్సాలోని 9 బ్లాకులను తెలంగాణ తీసుకుందని గుర్తు చేశారు.