Telangana Politics  KCR Vision: తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు  పార్టీని సరికొత్త పంథాలో నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పార్టీ అంతర్గత సంభాషణలు, బహిరంగ వేదికలపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తే.. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ  మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా నిలవబోతోందని ఆయన నమ్ముతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని, కేవలం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యే అసలు పోరు సాగుతుందని గులాబీ అగ్రనాయకత్వం బలంగా అంచనా వేస్తోంది. 

Continues below advertisement

 బీజేపీతోనే అసలు పోరు! 

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు రాబోయే రోజుల్లో ఆ పార్టీని మరింత బలహీనపరుస్తాయని కేటీఆర్ అంతర్గత విశ్లేషణల్లో పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఖాళీ చేసిన రాజకీయ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో యాంటీ-ఇంకంబెన్సీ ఓట్లను బీజేపీ వైపు వెళ్లకుండా అడ్డుకోవడం, అదే సమయంలో తెలంగాణ అస్తిత్వ వాదాన్ని బలంగా వినిపించడం ద్వారా క్యాడర్‌లో నూతనోత్తేజం నింపాలని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన తన తదుపరి కార్యాచరణను పూర్తిస్థాయిలో బీజేపీ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల చుట్టూనే తిప్పేలా ప్లాన్ చేస్తున్నారు.

Continues below advertisement

 ప్రాంతీయ పార్టీలకు కూటముల  అనివార్యత 

ప్రస్తుత జాతీయ రాజకీయాల ప్రాధాన్యతను పరిశీలిస్తే.. ఒంటరిగా ఉనికిని చాటుకోవడం ఏ ప్రాంతీయ పార్టీకైనా అంత సులువు కాదనేది నగ్నసత్యం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే   కూటమిని ఢీకొట్టాలన్నా లేదా జాతీయ స్థాయిలో తమ గళాన్ని బలంగా వినిపించాలన్నా ఏదో ఒక పెద్ద కూటమిలో భాగం కావడం ప్రాంతీయ పార్టీలకు అనివార్యంగా మారింది. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్  పేరిట థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయం క్లియర్-కట్‌గా ఎన్డీయే వర్సెస్  ఇండీ కూటమిగా చీలిపోయింది. ఈ కారణంగా బీఆర్ఎస్ కూడా తటస్థ వైఖరి వీడి, ఏదో ఒక వైపు మొగ్గు చూపాల్సిన సమయం ఆసన్నమైందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

 బీజేపీ వ్యతిరేకతే ఏకైక అజెండా? 

కేటీఆర్ సిద్ధాంతపరంగా, రాజకీయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర నిర్ణయాలు ఉన్నాయని, తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని ఆయన నిరంతరం ధ్వజమెత్తుతున్నారు. కాబట్టి, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయే కూటమి వైపు వెళ్లే ఛాన్స్ లేదు. మిగిలింది ఇండీ కూటమి మాత్రమే. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే అన్ని శక్తులను ఏకం చేయాలనే ఆలోచనతో కేటీఆర్ ఉన్నందున, ఆయన త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

‘ఇండీ’ నేతలతో కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న పాత బంధాలు

బీఆర్ఎస్ ఇండీ కూటమిలో చేరడానికి ఒక పెద్ద సానుకూల అంశం ఉంది. ఆ కూటమిలో ఉన్న మెజారిటీ పార్టీల అగ్రనేతలతో కేసీఆర్, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల సమయంలో కేసీఆర్ స్వయంగా శరద్ పవార్  , ఉద్ధవ్ ఠాక్రే  , మమతా బెనర్జీ , నితీష్ కుమార్,   అఖిలేష్ యాదవ్   లతో పాటు కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులతో పలుమార్లు సమావేశమయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తోనూ గులాబీ నేతలకు మంచి అనుబంధం ఉంది. కేటీఆర్‌కు కూడా జాతీయ స్థాయిలో దాదాపు అందరు ప్రాంతీయ పార్టీల యువ నేతలతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు ఉన్నాయి.

 రాష్ట్రంలో కాంగ్రెస్‌తో వైరం.. జాతీయంగా దోస్తీ సాధ్యమేనా? 

అయితే, ఇండీ కూటమిలో చేరడానికి బీఆర్ఎస్ ముందున్న ఏకైక ,  అతిపెద్ద అడ్డంకి  కాంగ్రెస్ పార్టీ . రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్‌కు బద్ధవైరం ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. జాతీయ స్థాయిలో అదే కాంగ్రెస్ సారథ్యంలోని ఇండీ కూటమిలో భాగస్వామి కావడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఆందోళన ఉంది. అయితే, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో లెఫ్ట్ పార్టీలు, ఢిల్లీ-పంజాబ్‌లలో ఆప్  పార్టీలు కాంగ్రెస్‌తో స్థానికంగా కొట్లాడుతూనే జాతీయంగా ఇండీ కూటమిలో కొనసాగుతున్నాయి. ఇదే  కేరళ,బెంగాల్ మోడల్ ను తెలంగాణలోనూ అప్లై చేస్తూ, జాతీయ ప్రయోజనాలు, బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఇండీ కూటమి ముఖద్వారం తట్టే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.