Janasena Joinings: మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbaryudu)  జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్(HYD) లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pavan Kalyan) సమక్షంలో ఆయన జనసేన(Janasena) తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం- జనసేన కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పవన్ ఆయనకు సూచించారు. సీనియర్ నాయకుడి చేరికతో జిల్లాలో జనసేన బలోపేతమవుతుందన్నారు. ఆయన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ కల్యాణ్(Pavan Kalyan) తెలిపారు.


జనసేనకు 'కొత్త' ఉత్సాహం 
భూమి గుండ్రంగా ఉంటుందన్న చందంగా  మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్ని పార్టీలు తిరిగి మళ్లీ జనసేన(Janasena)లో చేరారు. నాలుగు రోజుల క్రితమే పవన్ వెంట నడుస్తానని ప్రకటించిన కొత్తపల్లి సుబ్బారాయుడు..నేడు హైదరాబాద్(HYD) లో పవన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞుడైన  సుబ్బారాయుడు సేవలను పార్టీ అన్ని విధాల వినియోగించుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన రాకతో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. గెలుపు కూటమికి అందరూ సహకరించాలని పవన్ కోరారు. తెలుగుదేశం(TDP) పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సుబ్బారాయుడు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు(CBN) కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు జిల్లా మొత్తం ప్రభావం చూపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు..... 2009లో చిరంజీవి స్థాపించిన  ప్రజారాజ్యం(PRP) పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు. అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో బయటకు వచ్చిన ఆయన ఆ తర్వాత వైసీపీ(YCP)లో చేరి జగన్ వెంట నడిచారు. కొద్దిరోజులుగా  వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన జనసేన(Janasena)లో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayudu) తెలిపారు.సొంత ప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.  సొంత డబ్బులతో కౌలు రైతులకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. అమరావతి విషయంలోనూ పవన్ గొప్ప పోరాటం చేశారనీ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు.  పవన్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరానని ఆయన తెలిపారు. 


సుబ్బారాయుడి ప్రస్థానం 
తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన  ఆయన 1989, 1994, 1999, 2004లో టీడీపీ తరుఫున వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోయిన ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించారు.  ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. నాటి ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు  కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గానూ పనిచేశారు. ఇక 2019లో వైసీపీలో చేరారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో విభేదాలు తలెత్తడంతో ఆయన వైసీపీని వీడారు. ప్రస్తుతం జనసేనలో  చేరిన ఆయన నర్సాపురం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఆయన ముందుగా టీడీపీలోనే చేరదామనుకున్నా...పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు రావచ్చనే అంచనాలతో  పవన్ చెంతకు చేరారు. అయితే నర్సాపురం టిక్కెట్ కోసం ఇప్పటికే టీడీపీ, జనసేన నుంచి మాధవనాయుడు, బొమ్మిడి నాయకర్ పోటీపడుతున్నారు. ఎన్నారై కొవ్వలి నాయుడు కూడా  రేసులో ఉన్నారు. తాజాగా సుబ్బారాయుడు ఎంట్రీతో మరింత రంజుగా మారింది.