Eatala Rajender at BJPs Vijay Sankalp Yatra: గజ్వేల్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న కోపమే కారణమని.. అందుకే ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందని, ప్రధాని మోదీ మీద నమ్మకంతో బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కిందట హైదరాబాద్ పోవాలంటే బాంబులు పేలి చనిపోతారు అనే భయం ఉండేదని, మోదీ వచ్చాక బాంబుల మోతలు ఆగిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌లో సోమవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై ఉన్న కోపంతోనే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు వేశారని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు.


ఎటు చూసినా కుంభకోణాలే.. 
మహిళలు, యువత ప్రధాని మోదీ వెంట ఉన్నాని, ఆయనను మరోసారి గెలిపించుకునేందుకు సిద్ధం కావాలన్నారు. కాంగ్రెస్ పాలన ఎటు చూసినా కుంభకోణాలే కనిపించేవని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. 10 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలు, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకంతో పేదలకు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధించి, మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ఈటల ఆకాంక్షించారు.


విజయ సంకల్పయాత్రలో భాగంగా రాజరాజేశ్వర క్లస్టర్ - మెదక్ లో రోడ్ షో లో ఈటల పాల్గొని ప్రసంగించించారు. ‘’మోదీ పేద ఇంటి నుండి వచ్చిన బిడ్డ కాబట్టి పేదల కష్టాలు తీరుస్తున్నారు. దేశంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదు అని ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 4 కోట్ల ఇల్లు కట్టించి ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తా అని కేసీఆర్ మోసం చేశాడు. గ్రామపంచాయితీ సిబ్బందికి కూడా మోదీ డబ్బులు పంపించకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చెట్లు, లైట్లు, మోరీలు, రోడ్లు అన్నీ కేంద్ర నిధులతోనే వేస్తున్నారు. సఫాయి కార్మికుల కాళ్లుకడిగి గౌరవం పెంచితే, కేసీఆర్ 1700 మంది ఉద్యోగాలు తీసివేశారు.


కరోనా వ్యాప్తి సమయంలో దేశానికి ధైరాన్ని అందించిన వ్యక్తి ప్రధాని మోదీ. ప్రపంచానికి వాక్సిన్ అందించారు. కరోనా సమయం నుండి 5 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. పేదవాడు అధికారంలో ఉంటే ఏం చేస్తాడో చేసి చూపించారు నరేంద్ర మోదీ. 500 సంవత్సరాల కిందట అయోధ్యలో కూలగొట్టిన రామమందిరం తిరిగి నిర్మించారు. అయోధ్యలో రాముడు ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుంది అని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారు. ఒకప్పుడు భారతదేశం నుండి వచ్చారు అంటే విదేశాలలో చిన్న చూపు ఉండేది, కాని ఇప్పుడు గల్లా ఎగురవేసుకుని నేను భారతీయున్ని అని చెప్పుకొనే స్థాయికి తీసుకువచ్చారు’ అని ఈటల పేర్కొన్నారు.


కాంగ్రెస్ వాళ్లు వస్తే.. ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు. 4 వేల వృద్ధాప్య  పెన్షన్ అన్నారు. 6 వేలు వికలాంగుల పెన్షన్ అన్నారు. రైతులు అప్పుకట్టవద్దు. నేను వస్తే 2 లక్షల మాఫీ అన్నారు. మహిళా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అన్నారు. బస్ ఫ్రీ పెట్టారు కానీ బస్సులు లేవు. మోసం, అన్యాయం లేకుండా పాలన సాగాలంటే మోదీ మళ్ళీ ప్రధాని కావాలి, అందుకే ఈ విజయసంకల్ప యాత్ర చేస్తున్నామని’ మాజీ మంత్రి ఈటల వివరించారు. 


మల్లన్నసాగర్ లో 9 గ్రామాలు మునిగిపోయాయి.. ఆ రైతులు అడ్డా మీద కూలీగా మారిపోయారని చెప్పారు. ఇళ్లు పోయిన వారికి 250 గజాల జాగా ఇస్తా అన్నారు.. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి కలెక్టర్ ని తెచ్చి దొంగ పట్టాలు ఇచ్చారు. అవి పనికి రాకుండా పోయాయని మండిపడ్డారు. ప్రాజెక్ట్స్ కి బీజేపీ వ్యతిరేకం కాదు కానీ వెలకట్టలేని బంధం వదిలిపెట్టి వచ్చిన కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏమిటి ? వారిని దిక్కులేకుండా చేసింది కేసీఆర్  కాదా ? అని ఈటల ప్రశ్నించారు.