ఖమ్మంలో ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రధాన అనుచరుడి వ్యవహారం మంత్రికి తలనొప్పిగా మారింది. పువ్వాడ అజయ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్‌పై వస్తున్న ఆరోపణలు ఖమ్మం నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద నుంచి భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలల్లో కొన్ని ఇప్పుడు బహిర్గతం కావడంతో పువ్వాడ క్యాంపులో కలకలం రేపుతోంది.
ఖమ్మం జిల్లాలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రస్తుతం వస్తున్న ఆరోపణలతో ఇరకాటంలో పడుతున్నారు. సుడా చైర్మన్‌గా ఉన్న బచ్చు విజయ్‌కుమార్‌కు ప్రాధాన్యత కల్పించడంపై అటు పార్టీలోనూ ఇటు సొంత క్యాడర్‌లోనూ అసంతృప్తి నెలకొంది. అయితే ఎలాగైనా తన అనుచరుడికి ప్రాధాన్యత కల్పించాలనే నేపథ్యంలోనే మంత్రి పట్టుబట్టి ఆయనకు సుడా చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయితే ఇటీవల సుడా చైర్మన్ వసూళ్ల పర్వంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇది కాస్తా మంత్రికి తలనొప్పిగా మారింది.
సుడాలో అసలేం జరిగింది..
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్‌కు దీటుగా దూసుకువెళుతున్న ఖమ్మం నగరంలో సుడా చైర్మన్ పదవి కీలకంగా మారింది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ మాపియాగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నూతన వెంచర్ల అనుమతికి సంబందించి అనేక కఠిన నిబంధనలు విదించింది. వెంచర్లను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా డీటీసీపీ అనుమతి కావాలిల్స ఉంది. అయితే ఖమ్మం నగరం చుట్టు పక్కల డీటీసీపీ అనుమతి లేకుండా అనేక లే అవుట్లు ఉండటం, కొన్ని వెంచర్లకు సంబందించి కనీసం గ్రామపంచాయతీ అనుమతులు లేకపోవడంతో వాటిపై సుడా ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఉన్న వెంచర్లను తొలగించారు.
ఇక్కడే అసలు కథ మొదలైంది. సుడా చైర్మన్‌కు సన్నిహితంగా ఉన్న వారిని వదిలేసి ఇతరులకు సంబందించిన వెంచర్లపై దాడులు నిర్వహించడంతో ఆగ్రహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక్కసారిగా సుడా చైర్మన్ వసూళ్ల పర్వంపై ఆరోపణలు చేశారు. సుడా చైర్మన్‌కు సొమ్ములు ముట్టచెప్పిన వారికి ఎలాంటి అనుమతులు లేకుండా ఉంటే వారి వెంచర్ల జోలికి వెళ్లకుండా మిగిలిన వారిపై దాడులు నిర్వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న సుడా చైర్మన్.?
ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో సన్నిహితంగా ఉంటున్న సుడా చైర్మన్ ఆయనకు సంబందించిన అనేక వెంచర్లకు అనుమతులు లేకపోయినప్పటికి వాటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం మిగిలిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అస్త్రంగా మారింది. సుడా చైర్మన్‌కు సన్నిహితంగా ఉంటున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడని, కనీసం గ్రామపంచాయతీ లే అవుట్ పర్మిషన్ కూడా లేకుండానే వెంచర్లను ఏర్పాటు చేసి వినియోగదారులకు అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించకపోతుండటంతో అనేక మంది ఇతనిపై ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్న సుడా చైర్మన్ తనకు సొమ్ములు ముట్టచెప్పిన వారి వెంచర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.
సుడా పనితీరుపై ఆరంభం నుంచి ఆరోపణలు వస్తునప్పటికీ ప్రస్తుతం చైర్మన్ వసూళ్ల పర్వంపై మిగిలిన వారు గళమెత్తడంతో ఇప్పుడు మంత్రి పువ్వాడకు కాస్తా తలనొప్పిగా మారింది. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని పదేపదే చెప్పే పువ్వాడ అజయ్ ఇప్పుడు ప్రధాన అనుచరుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై ఇప్పుడు మంత్రి క్యాంప్‌లో చర్చానీయాంశంగా మారింది.
Also Read: Nizamabad News: ఇందూరు జిల్లా నిజామాబాద్ ఎలా అయ్యింది, పేరు మార్చడానికి కారణం ఇదే