Nizambad District Name Change: ఇందూరు జిల్లా పేరు నిజామాబాద్ గా ఎలా మారింది. పేరు మార్పు చేసేంత పరిణామం ఎందుకొచ్చింది. ఇందూరు జిల్లాగా ఉన్న పేరును నిజామాబాద్ గా మార్చింది ఎవరు.. సిర్నాపల్లి మీదుగా రైల్వే లైన్ వేసినందుకు జిల్లా పేరు మార్పు జరిగిందా.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే. 


గతంలో ఉన్న ఇందూరు జిల్లా చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ జిల్లాగా మారింది. ఈ జిల్లా ఎంతో చారిత్రాత్మకం. భిన్నజాతులు, విభిన్న సంస్కృతులకు నిలయం ఇందూరు జిల్లా. ఎన్నో చారిత్రాత్మక కట్టడాలకు ప్రసిద్ధి. జిల్లాను ఎంతో మంది రాజులు పాలించారు. ఎన్నో చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి. నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరు. ఇక్కడ 70 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ ఎక్కువగా వరి, మొక్కజోన్న, పసుపు వంటి పంటలు పండిస్తారు. నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. గతంలో నిజామాబాద్ జిల్లా మహారాష్ట్రలోని నాందేడ్ వరకు ఉండేది.


నిజామాబాద్ జిల్లాలో గుజరాతీలు, మరాఠీలు కూడా ఎక్కువగా ఉంటారు. మంచి వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి. రాష్ట్ర రాజధానికి 160 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది నిజామాబాద్. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ జిల్లా మీదుగా ముంబయ్ వరకు రైల్వే మార్గం ఉంటుంది. అయితే పూర్వం నిజామాబాద్ జిల్లాను ఇందూరు జిల్లాగా పిలిచేవారు. మరి ఇందూరు జిల్లాగా ఉన్న పేరు నిజామాబాద్ గా మార్చటానికి వెనుకున్న కారణం ఇదే...


ఇందూరును సిర్నాపల్లి దొరసాని శీలం జానకీభాయి పాలించేది. 1903లో నిజాం నవాబు సికింద్రాబాద్ నుంచి ఇందూరు మీదుగా మన్మాడ్ వరకు రైల్వే లైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఇందల్వాయ్ మీదుగా వెళ్తున్న రైల్వే లైన్ ను సిర్నాపల్లి మీదుగా వేయాలని దొరసాని శీలం జానకీ భాయి నిజాం నవాబును కోరారట. సిర్నాపల్లి రైల్వే లైన్ పడితే ఆ గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగు పడుతుందన్న భావనతో నిజాం నవాబుకు పెట్టిన ప్రతిపాదన ఆమోదించి జానకీ భాయి చెప్పిన విధంగా రైల్వే మార్గాన్ని సిర్నాపల్లి మీదుగా తీసుకొచ్చారు. తన కోరికను మన్నించిన నిజాంనవాబు రైల్వే మార్గాన్ని మార్చి సిర్నాపల్లి మీదుగా లైన్ వేయటంతో శీలం జానకీ భాయి అందుకు కృతజ్ఞతగా ఇందూరు జిల్లా పేరును నిజాం నవాబు పేరుతో నిజామాబాద్ జిల్లాగా మార్చారనేది చరిత్ర.


Also Read: Weather Updates: ఏపీలో వణికిస్తున్న చలి గాలులు, తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రత


Also Read: Medaram Jatara: మేడారం భక్తులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్‌న్యూస్, సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు