KCR Munugodu :    మునుగోడులో జరిగేది.. ఉపఎన్నిక కాదు మన జీవితాల ఎన్నిక అని తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడు ప్రజలకు స్పష్టం చేశారు. జరగబోయేది మన బతుకుదెరువు ఎన్నిక అని స్పష్టం చేశారు. ప్రజాదీవెన పేరుతో మునుగోడులో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సూటిగా ప్రసంగించారు. మునుగోడు నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయాధారిత నియోజకవర్గం కావడంతో రైతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు . ఈ నియోజకవర్గంలో లక్ష మందికిపైగా రైతు బంధు వస్తోందన్నారు. మీటర్లు పెట్టే మోదీ కావాలా... మీటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలా... అని కేసీఆర్ ప్రజలనుదదేశించి ప్రసంగించారు. ఈ విషయంపై గ్రామాల్లో చర్చ చేయాలని పిలుపునిచ్చారు. తాను  మీటర్లు పెట్టను అని చెప్పడానికి తెలంగాణ ప్రజల బలమే కారణమని..  మీరే నన్ను ఆగం చేస్తే ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు. మనుగోడు చరిత్రలో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్ రాలేదు. ఇకపై వస్తుందా... రాకూడదు. వస్తే మాత్రం మీ బావికాడ మీటర్ వస్తుందని హెచ్చరించారు. 


మోదీ...నువ్వు నన్ను గోకినా గోకపోయినా నేను నిన్నే గోకుతాను : కేసీఆర్ 


రైతు బంధును బంద్‌ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వడ్లు కొనం అంటూ లొల్లి పెట్టుకున్నారు. రైతులకు ఎందుకు పంచిపెడుతున్నారు. డబ్బులు ఎందుకు దురాబా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని కేసీఆర్ బీజేపీపై మండిపడ్డారు. రైతులకు  ఇవ్వకుండా బీజేపీ మిత్రులకు ఇవ్వాలంటున్నారని సెటైర్లు వేశారు.  అసెంబ్లీలో తొమ్మిది తోకలు ఉన్నాయి. అందులో మూడు తోకలు ఉన్నవాడు... 103 సీట్లు ఉన్న టీఆర్‌ఎస్‌ను పడగొడ్తాడట అని మండిపడ్డారు.  అహంకారమా... బలుపా... ఈడీ లేదూ బోడీ లేదు.. అన్నాననని కేసీఆర్ తెలిపారు.  ప్రజల కోసం నిలబడే వాళ్లు ప్రజల కోసం ఆలోచించే వాళ్లు మోదీకి భయపడరన్నారు.  మోదీ...నువ్వు నన్ను గోకినా గోకపోయినా నేను నిన్నే గోకుతాను. తమిళనాడు, బెంగాల్‌లో ప్రభుత్వాలను పడగొడతానంటారు. నిన్ను పడగొట్టేవాళ్లు లేరా... ఉన్నారు. నీ అహంకారమే నీకు శత్రువు అవుతుంది.. నిన్ను ముంచేస్తుందని హెచ్చరించారు. 


ఉపఎన్నిక తేవడం వెనుక మాయమశ్చీంద్ర ! 


మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ప్లొరైడ్‌ నీళ్లతో నడుములు ఒంగిపోయి ఏవిధంగా బాధపడిందో అందరికీ తెలుసు.  ఇవాళ ప్లోరైడ్ రహిత నల్గొండగా మార్చుకున్నామన్నారు.  తాగు నీళ్లు రావాలి. ఎక్కడి నుంచి రావాలి. నల్గొండ ఉంండేదే కృష్ణ బేసిన్. శ్రీశైలం ప్రాజెక్టు తీసుకొని లిఫ్టు ద్వారా నింపుకోవాలి. ఇది ఆషామాషీ విషయం కాదు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు. మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పచెప్పి పోరాడమంటే పనులు జరగవు. మన చుట్టూ ఏం జరుగుతుందో చర్చ పెట్టాలి. ఆ చర్చలో భాగంగా దేశంలో జరిగే వ్యవహారాలు, సమాజాన్ని చీల్చే రాజకీయంపై సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులతో చర్చలు జరుపుతున్నాం. ఐదారు నెలల నుంచి తలలు పగులు గొట్టుకుంటున్నాం. ఈ దేశ ప్రజలకు ఏం చేస్తే మంచి జరుగుతుందో అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు గోల్‌మాల్‌ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు వచ్చిన ఎన్నికలు ఎవరి వల్ల వచ్చాయని  కేసీఆర్ ప్రశఅనించారు.  దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి గుర్తుపట్టకపోతే అన్యాయం జరుగుతుందని ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు.  


కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పని చేస్తాం !


రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ప్రగతి శీల పార్టీలన్నీ ఏకం కావాలి ఈ దుర్మార్గులను పంపించాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ తెలిపారు.  జాతీయ స్థాయిలో సీపీఐ చర్చలు జరిపి టీఆర్‌ఎస్‌ కు మద్దతు ప్రకటించారు. దీనికి వాళ్లకు ధన్యవాదాలు. పల్లా వెంకట్‌రెడ్డి చెప్పిన సమస్యలు పరిష్కారం అవుతాయి. పేదల బతుకులు, బాగుపడే వారకు మన పోరాటం కొనసాగుతూ ఉండాలి. భవిష్యత్‌లో కూడా కలిసి పనిచేస్తాం. సీపీఐ, సీపీఎం ఇతర పార్టీలు కలిసి పని చేస్తామని ప్రకటించారు. 


కృష్ణా జలాలను ఎందుకు పంచలేదో అమిత్ షా చెప్పాలి !
 
రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా కృష్ణా జలాల పంపిణీ జరగలేదు. కృష్ణా జలాలు ఇయ్యనందుకే ఇక్కడ సభ పెట్టారా అని కేసీఆర్ ప్రశ్నించారు.  పంద్రాగస్టు నాడు మోదీ చెప్పిన మాటలకు మైకులు పగిలి పోయాయి. ఒక్కటైనా పనికి వచ్చే మాట ఉందా. కృష్ణా జలాలు పారిస్తే బంగారు పంటలు పండే ఛాన్స్ ఉంది. రావాలన పనులు స్టార్ట్ చేస్తే ఎందుకు అడ్డం పడుతున్నారని ప్రశ్నిస్తున్నానన్నారు. ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెపుతున్న బీజేపీ వాళ్లంతా దిల్లీ వెళ్లి ఇవి అడగరు కానీ... రేపు అమిత్‌షా వస్తే మాత్రం డోలు బాజాలు పట్టుకొని వెళ్తారట అని సెటైర్ వేశారు.  కేంద్ర హోంమంత్రిని నిలదీస్తున్నానని ... కృష్ణా జలాలు ఎందుకు తేల్చడం లేదో చెప్పాలన్నారు.  ప్రజలకు ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని జరగలేదు. జరగకపోగా... రోడ్లు అమ్ముతున్నారు.. రైళ్లు అమ్ముతున్నారు. అన్నింటినీ అమ్ముతున్నారు. మిగిలింది... రైతులు భూములు వ్యవసాయ పంటలు... అందుకే దీనిపై ఫోకస్ పెట్టారన్నారు.  



మత పిచ్చి కుల పిచ్చి ఎవరిని ఉద్దరించడానికి ?
 
మీరు ఒక్కొక్కరు ఒక్కో కేసీార్ కావాలని సీఎం పిలుపునిచ్చారు.  ఇది పార్టీల ఎన్నిక కాదన్నారు.  దేశంలో మత పిచ్చి కుల పిచ్చి మంచిదా.. ఎవరిని ఉద్దరించడానికి. అందరం బాగుండాలి మనం కూడా బాగుండాలి అని కోరుకోవాలన్నారు.   ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోంది. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కాలంలో కూడా రూపాయి ఇంతలా పడిపోలేదన్నారు.  నిరుద్యోగం పెరిగింది. కార్మికులు రోడ్డున పడుతున్నారు. పరిశ్రమలు అమ్ముతున్నారన్నారు.   వీళ్లను నమ్ముకంటే అన్ని సంక్షేమ పథకాలు రద్దు అవుతాయన్నారు. . గురజాత్‌లో ఆరువందలు పెన్షన్ ఇస్తున్నారు..  మాకు ఓట్లు వేయడం లేదా అని అడుగుతున్నారు.. ఆరువందలు ఇచ్చే బీజేపీకి ఇద్దామా... రెండు వేలు ఇచ్చే టీఆర్‌ఎస్‌కు టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారా అని కేసీఆర్ ఓటర్లను ప్రశ్నించారు. 


కాంగ్రెస్‌కు ఓటేస్తే వ్యర్థమే ! 


కాంగ్రెస్‌కు ఓటేస్తే శనగలు బావిలో వేసినట్టే... ఆ ఓటు వ్యర్థమవుతుందన్నారు.  ఇవాళ వ్యక్తికి వేయడం ముఖ్యం కాదు. తెలంగాణ ఏమంటుుందనేది ముఖ్యం. దేశమంతా చూస్తున్నారు. గారడీ విద్యలు, బొమ్మలు చూసి మోసపోతే గోస పడతామన్నారు.  ఆడబిడ్డలు... ఇంటికి వెళ్లిన తర్వాత కేసీఆర్‌ సభకు పోయిన తర్వాత ఆయన ఈ ముచ్చట చెప్పారు ఇది నిజామా కాదా అని చర్చ పెట్టాలన్నారు.  రైతులంతా బోరు వద్దకు వెళ్లి దండం పెట్టి ఓటు వేయాలి. గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటు వేయాలి. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలకు రావాలంటే... ఈ దుర్మార్గులకు తరిమికొట్టాలని కేసీార్ పిలుపునిచ్చారు.