Revant Vs Komati Reddy :  కాంగ్రెస్ పార్టీ ఇప్పుడ ఎదుర్కొంంటున్న సవాళ్లు గతంలో ఎదుర్కొని ఉండదు. ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులతో పోరాడాలి.. అంతకు మించి సొంత పార్టీలోనూ ఓ మాదిరి యుద్ధమే చేసుకోవాలి. ఆ పార్టీ నేతలంతా ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటూ ఎన్నికల్లో ప్రత్యర్థులపై పోరాడతారు. కానీ ఈ ప్రయత్నాల్లో ప్రతీ సారి ఫెయిలవుతూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ వారిలో అసలు సమస్య తమలోనే ఉందన్న ఆలోచనలేదు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక ముందు కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా  చేస్తే.. కంచుకోట లాంటి మునుగోడులో గెలవడానికి నేతలందరూ కలిసి పోరాడకుండా. తమలో తాము యుద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడా యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరింది. 


కోమటిరెడ్డి అడిగినట్లుగా క్షమాపణలు చెప్పిన రేవంత్ 


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి నల్లగొండ రాజకీయాల్లోనే పట్టున్న నేత. ఆయన అండతోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ సీటు దక్కించుకుని నేతగా ఎదిగారు. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. కానీ వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్‌పై తన నిబద్ధతను చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మునుగోడులో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాను కానీ తనను కొందరు కించపరిచారని వారి నుంచి క్షమాపణ కావాలని పట్టుబట్టారు. అయితే దీనిపై పెద్దగా చర్చ జరగకుండానే ఆయన కోరినట్లుగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ కూడా క్షమాపణ చెప్పారు. అయితే  క్షమాపణ చాలదలని మళ్లీ కోమటిరెడ్డి రివర్స్ అయ్యారు. 


క్షమాపణ చాలదంటూ రివర్స్ అయిన కోమటిరెడ్డి 


ఈ ఎపిసోడ్ అలా సాగుతోంది.  సోనియా అపాయింట్‌మెంట్ అడిగానని పార్టీలో పరిస్థితులన్నీ ఆమెకు చెప్పిన తర్వాత తానుమునుగోడులో ప్రచారానికి సిద్ధమని వెంకటరెడ్డి ప్రకటించారు. దీనిపై  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డితో కలసి ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. నిజానికి రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఎప్పుడూ పార్టీలో ప్రత్యర్థులుగా చూడలేదు . అయితే వారు మాత్రం తమకు రావాల్సిన అవకాశాలను రేవంత్ రెడ్డి పొందారన్న ఆగ్రహంతో ఉన్నారు పదే పదే రేవంత్‌ను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాను కోమటిరెడ్డితో పని చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో కోమటిరెడ్డిపై మరోసారి ఒత్తిడి పెరిగినట్లయింది. 


కలిసి ప్రచారానికి సిద్ధమన్న రేవంత్.. ఇప్పుడు కోమటిరెడ్డి ఏం చేస్తారు ?


కోమటిరెడ్డి వెంకటరెడ్డి ... సోదరుడు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా.. ఖండించలేదు. ఆయనపై ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే ఆయనపై అపనమ్మకం ఏర్పడింది. రేపో మాపో ఆయన కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి సమయంలో ఆయన పార్టీ వీడటానికి కారణం తాము కాదని చెప్పడానికి రేవంత్‌తో పాటు ఆయన వర్గీయులు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. రేవంత్ కూడా ఈ విషయంలో ఎంత తగ్గడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులోనే పడినట్లయింది. మరి ఎలా స్పందిస్తారో ?