KCR National Party :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఎలా చేయబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కొత్తగా జాతీయ పార్టీని ప్రారంభించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. కేసీఆర్ కూడా తాను  జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రతీ సందర్భంలోనూ చెబుతున్నారు. అయితే జాతీయ పార్టీని పెట్టబోతున్నానని ఇంత వరకూ ఎక్కడా చెప్పలేదు . అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కలసి కట్టుగా బీజేపీని గద్దె దింపే ఆలోచన చేద్దామంటున్నారు. వారిలో కొంత మంది చూద్దామంటున్నారు.. మరికొంత మంది చేద్దామంటున్నారు. అయితే్ కేసీఆర్ సొంత పార్టీ పెట్టాలనుకుంటే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను ఎలా కలుపుకుంటారు ? ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ పోటీ చేయదా ? లేకపోతే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఓ వేదికను పెట్టబోతున్నారా?


కేసీఆర్ జాతీయ పార్టీ ఖాయమన్న ప్రచారం!


తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలపై అన్ని విధాలుగా అధ్యయనం చేసిన తర్వాత కేసీఆర్ రైతు ఎజెండాతో జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలుచెబుతున్నాయి.  తన పార్టీ పేరును కూడా భారత రైతు సమితిగా ఖరారు చేశారని అనధికారికంగా చెబుతున్నారు.  ఇప్పటి వరకూ భారత రాష్ట్ర సమితి… బీఆర్ఎస్ ను ప్రారంభిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆయన రైతు సమితికే మొగ్గు చూపారని..  కేసీఆర్ ఇతర పార్టీలను కలుపుకోవడం కన్నా.. సొంతంగా జాతీయ పార్టీ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు.   రైతులందర్నీ ఏకం చేస్తే కేంద్రాన్ని ఎదిరించవచ్చని కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు.  


ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు దేని కోసం ?


కేసీఆర్ సొంత పార్టీ పెట్టాలనుకుంటే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో ఎందుకు భేటీలు అవుతున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. తాను రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వతా  ఆయా పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని కొంత మంది చెబుతున్నారు. కానీ అలా కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటే జాతీయ పార్టీ అవసరం లేదు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఏర్పాటు చేయవచ్చు. టీఆర్ఎస్‌ను కాదని కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సఖ్యత ఉన్న పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా పోటీ చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీలు కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని ... సీట్లు కేటాయించే అవకాశం లేదు. కర్ణాటకలో జేడీఎస్ అయినా.. బీహార్‌లో ఆర్జేడీ కూటమి అయినా... ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా సరే .. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉన్నా సరే.. ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇతర పార్టీలు బలపడటానికి ఆయా ప్రాంతీయ పార్టీలు అంగీకరించవు. మరి కేసీఆర్ ప్రాంతీయ పార్టీల నేతల్ని ఎందుకు ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది సస్పెన్స్‌గా మారింది. 


బీజేపీకి వ్యతిరేకంగా ఓ వేదికను రూపొందిస్తున్నారా !?


ఉత్తరాదిలో దక్షిణాదికి చెందిన నేతలకు పెద్దగా పలుకుబడి ఉండదు .  ఇక్కడి రాజకీయాలకు అక్కడ ఎలాంటి ప్రచారమూ లభించదు. అందుకే  గుర్తింపు ఉండదు. కేసీఆర్ జాతీయ పార్టీ  పెట్టినా అక్కడి  ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టపడాల్సి ఉంటంది. దానికి సమయం సరిపోదు. అందుకే కేసీఆర్ బీజేపీని  గద్దెదించాలన్న లక్ష్యంతో ఓ జాతీయ వేదికను సిద్ధం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. అందులో ఎవరి రాజకీయ పోరాటం వారు చేసుకుంటారని.. అంతిమగా ఢిల్లీలో మాత్రం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా నిలబడేలానే ఐడియాలజీతో ఉన్న పార్టీలు ఉంటాయని అంచనా  వేస్తున్నారు. 


కేసీఆర్ ఎలాంటి ఆలోచనలో ఉన్నారో బయటకు రావడం లేదు. అది  కేసీఆర్ మార్క్ రాజకీయం. తాను వేయబోయే అడుగులపై విస్తృతమైన చర్చ జరిగేలా చూసుకుని చివరిగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తారు కేసీఆర్. ఇప్పుడు కూడా అదే జరుగుతుందనుకోవచ్చు.