Munugode TRS :   టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే కసరత్తులో బిజీగా ఉన్న కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికల బాధ్యతలను ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు అప్పగించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. మునుగోడు ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావుతో చర్చించారు. ఇప్పటికే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసినా .. నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతల్లో ఉన్న అసంతృప్తి కారణంగా అధికారికంగా ప్రకటించలేదు. దసరా రోజునే అభ్యర్థిగా కూసుకుంట్లను ప్రకటిస్తారు. 


దసరా రోజున అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రకటన !


అయితే పార్టీ నేతలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలియచేయలేదు. అక్కడి పరిస్థితులన్నింటినీ అంచనా వేసిన కేసీఆర్ పార్టీ నేతలను బుజ్జగించడంతో పాటు ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడంలో చాకచక్యం చూపే హరీష్ రావుకు పూర్తి బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా మంత్రిగా జగదీష్ రెడ్డికి ఎలాగూ  బాధ్యతలుంటాయి. ఇక పార్టీ తరపున ఇంచార్జ్‌గా మాత్రం హరీష్ రావు వ్యవహరించనున్నారు. ఆయన ఇక మునుగోడులోనే మకాం పెట్టే అవకాశం ఉంది. సమీక్షలో కేసీఆర్ హరీష్ రావుకు ఈ అంశంపై స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  


మునుగోడులో మొత్తం 86 మంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు 


మునుగోడుపై ఇప్పటికే ఓ బ్లూప్రింట్‌ను టీఆర్ఎస్ రెడీ చేసుకుంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు.  ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏకంగా 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో మోహరించబోతున్నారు. ఇంచార్జ్లుగా నియమితులైన వారంతా దసరా తర్వాత తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని అధిష్టానం ఆదేశించింది  ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో గ్రామాలకు వెళ్లాలని.. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. ఎప్పుడెక్కడ ఎలా ప్రచారం చేయాలి...,. ఇతర పార్టీల నేతల్ని ఎలా ఆకర్షించాలి.. మద్దతు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీల ఓటర్లతో ఎలా ఓట్లు వేయించుకోవాలన్నదానిపై వీరు రూట్ మ్యాప్ రెడీ చేసే అవకాశం ఉంది. 


ఉపఎన్నికను పర్యవేక్షించనున్న హరీష్ రావు 


హరీష్ రావుకు టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరు ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి కీలక కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చినా ఆయనకే బాధ్యతలిచ్చేవారు. ఇటీవల దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల బాధ్యతలు ఆయనకు ఇచ్చారు. అయితే నాగార్జున సాగర్, హుజూర్ నగర్ వంటి ఎన్నికల బాధ్యతలు ఆయనకు ఇవ్వలేదు. యాధృచ్చికంగా హరీష్ బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్‌కు సవాల్ లాంటి నియోజకవర్గంలో కూడా హరీష్‌కే బాధ్యతలిస్తు్ననారు. అయితే ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా పార్టీకి అనుకూలంగా మలిచి విజయం సాధించి పెట్టడంలో ఆయనది ప్రత్యేకశైలి అని టీఆర్ఎస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. 


తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్, వ్యర్థాల నిర్వహణలో సరిగాలేదని భారీ జరిమానా