Chiru On Pawan :  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ఇప్పటి వరకూ రాజకీయంగా చిరంజీవి ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవడంతో రాజకీయ పరమైన ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ఇప్పుడు రాజకీయ నేపధ్యం ఉన్న గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నటించడంతో రాజకీయ ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఆ సినిమా ప్రమోషన్లలో మీడియా సంస్థలతో మాట్లాడుతున్న చిరంజీవి సోదరుడి రాజకీయంపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కే తన మద్దతు అని స్పష్టంగా ప్రకటించారు. ఎప్పుడూ తన మద్దతు పవన్ కే ఉంటుందని తెలిపారు. 


పవన్ కల్యాణ్ ప్రయత్నాలకు తన ఎప్పుడూ మద్దతు 


పవన్ కల్యాణ్ నిబద్దత, నిజాయితీ తనకు తెలుసని మెగాస్టార్ తెలిపారు. పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎక్కడా పొల్యూట్ కాలేదన్నారు. పవన్ కల్యాణ్ ఎలాంటి రాజకీయం చేస్తారు.. ప్రజలు ఎలా ఆదరరిస్తారు అనేది భవిష్యత్‌లో వారే నిర్ణయిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్ లాంటి నిబద్ధతత ఉన్న నాయకుడు రావాలనేది తన ఆకాంక్ష అని చిరంజీవి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ చేసే ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. 


పవన్ ఎమర్జ్ అవడానికే రాజకీయాల నుంచి విరమణ 


తాను ఎందుకు రాజకీయాల నుంచి విరమించుకుంది కూడా చిరంజీవి తెలిపారు. పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తాను మరో పార్టీలో ఉండటం.. పవన్ మరో పక్కన ఉండటం వల్ల ప్రయోజనం కన్నా  నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. అందుకే తాను విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయితేనే పవన్ కల్యాణ్ ఎమర్జ్ అవుతాడన్న కారణంగా తాను సైలెంట్ అయ్యాన్ననారు. పవన్ కల్యాణ్‌కు భవిష్యత్‌లో ప్రజలు పరిపాలించే అవకాశాన్నిప్రజలు కల్పిస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నానని ప్రకటించారు. 


గాడ్‌ఫాదర్‌లో ఎవరినీ ఉద్దేశించి డైలాగులు పెట్టలేదన్న చిరంజీవి


గాడ్ ఫాదర్ సినిమాలో ప్రస్తుత ఏపీ రాజకీయాలపై ఎలాంటి సెటైర్లు వేయలేదని చిరంజీవి స్పష్టం చేశారు. గాడ్ ఫాదర్ సినిమా.. మలయాళంలో వచ్చిన లూసిఫర్ అనే సినిమాకు రీమేక్. ఆ సిని్మాలో ఉన్న వాటినే యథాతథంగా తీసుకున్నామన్నారు.అందులో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాశామని.. ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి డైలాగులైనా ఎవరైనా అన్వయించుకుని భుజాలు తడుముకుంటే దానికి తానేం చేయలేనని చిరంజీవి స్పష్టం చేశారు.  


అన్ని ఊహాగానాలకు చెక్ 


చిరంజీవిని  ఆకర్షించేందుకు బీజేపీ సహా ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.... కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  తమకు చిరంజీవికి సపోర్ట్ ఉందని... పేర్ని నాని లాంటి వైఎస్ఆర్‌సీపీ నేతలు అప్పుడప్పుడూ ప్రకటిస్తూంటారు. వీటన్నింటికీ చిరంజీవి తన తాజా ప్రకటనతో చెక్ పెట్టారని అనుకోవచ్చు.  చిరంజీవి కూడా ఇక తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేసినట్లయింది.