Bihar PK Padayatra : రాజకీయ పార్టీ పెట్టేందుకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా బీహార్ మొత్తం పాదయాత్ర చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ఖర్చు ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో తిరుగులేని రాజకీయ నాయకుడవ్వాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టారు. బీహార్ మొత్తం దాదాపుగా ఏడాదిన్నర పాటు తిరిగేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గాంధీ జయంతి రోజున చంపారన్ జిల్లా నుంచి ప్రారంభించారు. బహిరంగసభకు వంద మంది కూడా రాలేదని అందరూ సెటైర్లేస్తున్నారు కానీ ఆయన మాత్రం రూ. కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారు.
పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్.. టెలివిజన్స్‌లో స్లాట్స్ ..సోషల్ మీడియా క్యాంపైన్లు..ఇంకా ఐ ప్యాక్ మ్యాన్ పవర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాదయాత్ర ఓ రేంజ్‌లో సాగుతోంది. అయితే దీనంతటికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయని బీహార్ రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పాదయాత్ర ప్రారంభం రోజున ప్రకటనల కోసం కోట్లు ఖర్చు పెట్టారని అంటున్నారు. అంత డబ్బు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందని సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలు ఎందుకు దృష్టి పెట్టవని ప్రశ్నిస్తున్నారు. ఆయనకు మద్దతుగా బీజేపీ ఉంది కాబట్టే పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటి.. ఐ ప్యాక్ అనే సంస్థను ప్రారంభించి రాజకీయ పార్టీలకు సేవలు అందిస్తున్నారు. మొదట బీజేపీతో ప్రారంభించి ఆ తర్వాత చాలా పార్టీలకు పని చేశారు. ఇప్పుడు ఆయన ఐ ప్యాక్ యాజమాన్యంలో ఉన్నారు కానీ.. నిర్వహణ నుంచి మాత్రం వైదొలిగారు. ఐ ప్యాక్ సేవలు అందిన వారిలో కాంగ్రెస్ , వైఎస్ఆర్‌సీపీ, టీఎంసీ, డీఎంకే వంటి అధికారం పొందిన పార్టీలు ఉన్నాయి. వీటికి సేవలు అందించేందుకు ఆయన వందల కోట్లలోనే ఫీజు వసూలు చేశారన్న ప్రచారం జరిగింది. కానీ రాజకీయ పార్టీలు నేరుగా అన్ని వందల కోట్లు చెల్లించలేవు. చెల్లిస్తే ఆడిటింగ్‌లో తేలిపోతుంది. కానీ ఇప్పటి వరకూ అలా చెల్లించినట్లుగా ఎప్పుడూ బయటకు రాలేదు.
ఇటీవల టీఆర్ఎస్‌తో ఐ ప్యాక్ ఒప్పందం చేసుకున్న సమయంలోనూ ఇలాగే వందల కోట్ల డీల్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పీకే తనకు మిత్రుడని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవలు అందిస్తున్నారని చెప్పారు. కానీ ఉచితంగా సేవల చేయడానికి ప్రశాంతి కిషోర్ పెట్టింది స్వచ్చంద సంస్థ కాదు కాబట్టి ఎవరూ నమ్మలేదు. ఆ సంస్థకు ఎంత ఆదాయం వస్తుంది.. ఎంత లాభం అనేది స్పష్టత లేదు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్‌సీపీ వంటి పార్టీలకు కీలకంగా పని చేస్తోంది. కానీ ఫీజు విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్రకు ఖర్చు పెట్టే మొత్తం ఈ రాజకీయ పార్టీలకు కన్సల్టెంట్‌గా ఉండటం వల్ల వచ్చే ఆదాయంతోనే ఆయన ఖర్చు పెట్టి ఉండాలి. లేకపోతే విరాళాలు అయినా ఇచ్చి ఉండాలి. అందుకే బీహార్ రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఐడీ, ఈడీలతో విచారణ కోరుతున్నాయి. ఆ దర్యాప్తు సంస్థలు విచారణ చేయకపోయినా నిధులపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇస్తే ఆయా రాజకీయ పార్టీలు సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆరోపణలు మరింత ఎక్కువ అవుతాయి.