Communication Gap Between Pawan Kalyan And Leaders : "నేనొక్కడినే మాట్లాడాలా? మీ గళాలు ఎందుకు విప్పరు?" అంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాగే అసహనం వ్యక్తం చేశారు. దీనికి కారణం కీలకమైన విషయాలు జరిగినప్పుడు జనసేన వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. పవన్ ఇలా బలంగా ప్రశ్నించడం జనసేన అంతర్గత శ్రేణుల్లో సుదీర్ఘకాలంగా గూడుకట్టుకున్న ఒక పెద్ద నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన పొలిటికల్ అలారమ్ మోగడానికి కారణం అయింది.   జనసేనలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడగల సత్తా, సబ్జెక్ట్ ఉన్నవారే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   నుంచి వచ్చే ప్రతి విమర్శకూ క్షేత్రస్థాయిలో ధీటుగా బదులివ్వగల కేడర్ ఉన్నప్పటికీ, వారు వ్యూహాత్మక మౌనం వహించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  

Continues below advertisement

 స్పష్టత లేని పొలిటికల్ గైడ్‌లైన్స్ 

ఒక క్యాడర్ బేస్డ్ పొలిటికల్ పార్టీగా ఎదగాలంటే కేవలం అధినేత ఇమేజ్ మాత్రమే సరిపోదు. ప్రతీ ఇష్యూపై పార్టీ అధికారిక స్టాండ్ ఏంటో స్పష్టంగా తెలియజేసే టాకింగ్ పాయింట్స్ శ్రేణులకు అందాలి. వైసిపి లేదా ఇతర ప్రధాన పార్టీలను గమనిస్తే.. ఏదైనా ఒక వివాదాస్పద అంశం తెరపైకి రాగానే, టాప్ మేనేజ్‌మెంట్ ,  ఐప్యాక్  లాంటి స్ట్రాటజీ టీమ్స్ నుండి ప్రతీ లీడర్‌కూ గంటల వ్యవధిలో క్లారిటీ వెళ్తుంది. కానీ జనసేనలో ఆ తరహా  కమ్యూనికేషన్ స్ట్రక్చర్  ఇంకా పూర్తిస్థాయిలో బిల్డ్ కాలేదన్న అభిప్రాయం ఉంది. తాము మాట్లాడే ఏ ఒక్క మాటైనా రేపు పార్టీకి డ్యామేజ్ కలిగిస్తుందేమో, అధినేత లైన్‌కు భిన్నంగా ఉంటుందేమో అనే భయం, సందేహం జనసేన ప్రజాప్రతినిధులను నోరు విప్పకుండా అడ్డుకుంటోంది. పార్టీ స్టాండ్ ఏమిటన్నదానిపై క్లారిటీ లేకే ఎక్కువ మంది సైలెంట్ గా ఉంటున్నారు.   సాయికృష్ణ ఇష్యూలో సంక్లిష్టత 

Continues below advertisement

జనసేన నేతలు  సాయికృష్ణ ఇష్యూలో పెద్దగా మాట్లాడకపోవడానికి ఇందులో ఉన్న సంక్లిష్టతే కారణం.  ఈ కేసును ఆసరాగా చేసుకుని వైసీపీ సామాజిక వర్గాల సమీకరణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద హడావుడి చేసింది. ఇలాంటి సున్నితమైన సమయంలో స్థానిక జనసేన నేతలు కత్తిమీద సాము చేయాల్సి వచ్చింది.  సాయికృష్ణపై ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఉన్నందున, అతనికి అనుకూలంగా మాట్లాడితే అది నేరస్థుడిని వెనకేసుకొచ్చినట్లు అవుతుంది . అదే సమయంలో వైసీపీ రగిల్చిన కుల సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ అతన్ని నేరస్థుడు అని తీవ్రంగా ఖండిస్తే.. క్షేత్రస్థాయిలో పొలిటికల్ బ్యాక్‌ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గైడెన్స్ లేక నేతలు సైలెంట్ అయిపోయారు. పవన్ కల్యాణ్.. నేరస్తులకు అండగా ఉండేది లేదని.. చెప్పిన తర్వాతే స్పందించడం ప్రారంభించారు.   నాయకత్వ లోపం కాదు.. స్ట్రక్చరల్ కమ్యూనికేషన్ గ్యాప్! 

సాయికృష్ణ లాంటి సంక్లిష్టమైన కేసుల్లో పార్టీ అధిష్ఠానం ఒక అధికారిక స్టాండ్ తీసుకుని నేతలకు గైడెన్స్ ఇవ్వనంత వరకు, వారు స్థానికంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి  నేరస్థులకు కులం, మతం ఉండవు. అని క్లారిటీ ఇచ్చిన తర్వాతే పార్టీ శ్రేణులకు ఒక పొలిటికల్ లైన్ దొరికింది. కానీ, ప్రతీ చిన్న విషయానికీ, ప్రతీ స్థానిక వివాదానికీ అధినేతే స్వయంగా వచ్చి లైన్ క్లియర్ చేయాల్సి రావడం పార్టీ వ్యవస్థాగత లోపాన్ని సూచిస్తోంది. అధినేత మాట్లాడే వరకు మిగతా నేతలు  వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉండిపోవడం వల్ల, వైసీపీ చేసే దాడులకు తక్షణమే కౌంటర్ ఇచ్చే గోల్డెన్ అవర్స్ చేజారిపోతున్నాయి. 

 గ్యాప్‌ను వర్చువల్‌గా భర్తీ చేయాల్సిన టైమ్ 

కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అడ్మినిస్ట్రేషన్, శాఖల సమీక్షలతో బిజీగా ఉంటున్న వేళ.. పార్టీ రోజువారీ పొలిటికల్ స్ట్రాటజీలను నడిపేందుకు ఒక అంకితమైన మీడియా అండ్ పొలిటికల్ వింగ్  అత్యంత అవసరం. ఏ ఇష్యూపై ఎలా రియాక్ట్ అవ్వాలో, డిబేట్స్‌లో ఏ పాయింట్స్ మాట్లాడాలో నేతలకు డిజిటల్ పద్ధతిలో గైడ్‌లైన్స్ పంపే రోబోస్ట్ వ్యవస్థను జనసేన నిర్మించుకోవాలన్నఅభిప్రాయం ఉంది. అప్పుడే నేతల్లో ఉన్న సందేహాలు పటాపంచలై, వైసీపీ చేసే విమర్శలపై పవర్‌ఫుల్ వాయిస్‌తో కౌంటర్ ఎటాక్ చేసే వీలుంటుంది. పార్టీలో క్షేత్రస్థాయి నేతలకు, టాప్ లీడర్‌షిప్‌కు మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ను పవన్ కళ్యాణ్ ఎంత వేగంగా భర్తీ చేస్తే.. రాబోయే రోజుల్లో జనసేన వాయిస్ అసెంబ్లీ లోపలా, బయటా అంత గట్టిగా వినబడుతుందని అనుకోవచ్చు.