Madhavi Latha Sports Pistol:  హైదరాబాద్ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది వివాదాలే. ఎన్నికల ప్రచారంలో ఓ వర్గం ప్రార్థనా మందిరంపైకి ఆమె బాణం వేస్తున్నట్లుగా చేసిన యాక్షన్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఆమె తుపాకీతో షూటింగ్ చేస్తున్నారు.    స్పోర్ట్స్ పిస్టల్ అందుకుని షూటింగ్ రేంజ్‌లో ప్రత్యక్షమయ్యారు. XII తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అథ్లెట్‌గా బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు. 

Continues below advertisement

ఆరు సంవత్సరాల గాయం.. ఓటమి ఎరుగని పోరాటం! 

రాజకీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా బిజీగా ఉండే మాధవీలత వెనుక ఒక తెలియని శారీరక సంఘర్షణ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం ఆమెకు ఎదురైన తీవ్రమైన భుజం గాయం ఆమె జీవితాన్ని శారీరకంగా ఎన్నో పరిమితుల్లోకి నెట్టేసింది. అయితే, ఆ పరిమితులకు లొంగిపోవడం ఆమె నైజం కాదని మరోసారి రుజువైంది. గాయాన్ని ఒక సవాలుగా తీసుకుని, విల్‌పవర్‌తో స్పోర్ట్స్ పిస్టల్ పట్టి సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వయసు గానీ, శారీరక ఎదురుదెబ్బలు గానీ ఏవీ కూడా తిరిగి లేవడానికి అడ్డంకులు కావని ఆమె తన తాజా నిర్ణయం ద్వారా చాటిచెప్పారు.   

Continues below advertisement

  వివాదాల నుంచి పతకాల వేట వైపు.. 

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసి దేశవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచారు మాధవీలత. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన బాణం వేసే సైగలు, ఆ తర్వాతి కాలంలో వచ్చిన పలు పొలిటికల్ ఇష్యూస్ ఆమె చుట్టూ ఎప్పుడూ వివాదాల వలయాన్ని సృష్టించాయి. అయితే, వాటన్నింటినీ పక్కనబెట్టి ఇప్పుడు డిసిప్లిన్, ఫోకస్ అత్యంత అవసరమైన 'షూటింగ్' స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వెనుక ఆమె వ్యూహాత్మక ఆలోచన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కేవలం గెలవడం, ఓడడం కోసమే కాకుండా.. అడ్డంకులను అధిగమించి ముందుకు సాగే ధైర్యాన్ని ప్రదర్శించడానికే తాను తుపాకీ పట్టినట్లు ఆమె పేర్కొన్నారు.  నేను కాదు.. మనమంతా చేయగలం  - భారత్ కోసం పిలుపు! 

తన జీవిత ప్రయాణం దేశంలోని కనీసం ఒక్క మహిళకైనా, యువతకైనా స్ఫూర్తినిచ్చినా తన ప్రయత్నం సఫలమైనట్లేనని మాధవీలత చెబుతున్నారు. అసాధ్యం అనుకున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ పౌరులు ముందుకు రావాలి..  నేను చేయగలను అనే స్థాయి నుంచి మనం చేయగలం  అనే నమ్మకంతో పటిష్టమైన, ఆత్మవిశ్వాసం గల భారత్‌ను నిర్మిద్దాం అంటూ ఆమె ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రాజకీయ వేడిని కాసేపు పక్కనబెట్టి, ఒక క్రీడాకారిణిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడటానికి ఆమె చూపిన చొరవపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆమె సంకల్పాన్ని మాత్రం అందరూ అభినందిస్తున్నారు.