Pawan Kalyan Janasena Information Committees: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేడర్ ఆధారిత బలమైన నాయకత్వ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల నియామకాన్ని చేపట్టారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, దశాబ్ద కాలంగా జెండా మోస్తున్న సామాన్య జనసైనికుల నుంచే భవిష్యత్ రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే బృహత్తర వ్యూహంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సరికొత్త ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అత్యంత పకడ్బందీగా ఈ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కూడిన ఒక జంబో కమిటీ బాధ్యతలను చూస్తుంది. ఈ కమిటీల కూర్పులో ప్రతి పార్లమెంట్‌కు ఒక సీనియర్ పరిశీలకుడు, స్థానిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ముగ్గురు సీనియర్ నాయకులు ఉంటారు. వీరితో పాటు ఏటా నిలకడగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ముగ్గురు 'సాధక్స్'ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్‌ను ఇందులో భాగస్వామ్యం చేశారు. వీరికి తగిన సాంకేతిక, పరిపాలనా సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా కేటాయించారు.
ఈ కమిటీల ప్రధాన విధి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధక్స్ , వీరమహిళల సమగ్ర సమాచారాన్ని సేకరించడం. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో వారి పనితీరు, ప్రజాదరణ, అంకితభావం మరియు నాయకత్వ లక్షణాలపై ఈ కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తాయి. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుండి ఎన్నో కష్టనష్టాల నెదుర్కొని జనసేన జెండాను భుజాన మోస్తున్న అసలైన జనసైనికులను గుర్తించి, వారిని చట్టసభలకు వెళ్లే నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ భారీ రాజకీయ కసరత్తు ముఖ్య ఉద్దేశం.
పార్లమెంట్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే పార్టీలోని వివిధ అనుబంధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారిని వారి నైపుణ్యాల ఆధారంగా గుర్తించనున్నారు. నాయకులు, కార్యకర్తల ఆసక్తి , క్షేత్రస్థాయి సామర్థ్యానికి తగిన విధంగానే భవిష్యత్తులో వారికి పార్టీ పదవులు మరియు ప్రభుత్వ అనుబంధ బాధ్యతలు కేటాయించబడతాయి. కమిటీలు క్షేత్రస్థాయి నుంచి సేకరించి అందించే పూర్తి సమాచారాన్ని, నివేదికలను కూలంకషంగా పరిశీలించిన అనంతరం మాత్రమే వివిధ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తీసుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేవలం అధికారానికే పరిమితం కాకుండా.. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రౌండ్ లెవల్‌లో కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, తగిన ప్రాధాన్యత కల్పించేలా పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నారు. అర్హత, నిబద్ధత మాత్రమే ప్రామాణికంగా సాగుతున్న ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
