Pawan Kalyan Comments In Pithapuram: రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన అంతం చేసేందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పునరుద్ఘాటించారు. తాను పోటీ చేయబోయే పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం నుంచి శనివారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 'వారాహి విజయభేరి' సభలో పవన్ ప్రసంగించారు. అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ అహంకార పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని.. కూటమిదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గం ఇంఛార్జీ వర్మకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. ఇక్కడ లక్ష మెజారిటీతో గెలపిస్తా అన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా దశాబ్ద కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని అన్నారు. తనను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
'మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా'
పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ హామీ ఇచ్చారు. 'పిఠాపురానికి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకువస్తా. నియోజకవర్గం అభివృద్ధికి 12 నుంచి 14 పాయింట్స్ ఫార్ములా ఉంది. పవన్ కల్యాణ్ మీకు జవాబుదారీతనం. నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఎంతో విశిష్టమైన నేల ఇది. ఈ నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకే వచ్చా. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆస్పత్రులన్నీ బాగు చేస్తా. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా. 54 గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తా. పిఠాపురంలో 20 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తా. నన్ను ఓడించడానికి చిత్తూరు నుంచి మిథున్ రెడ్డి వచ్చారు. మండలానికి ఓ నాయకుడిని పెట్టారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు.' అంటూ పవన్ ధ్వజమెత్తారు.
వైసీపీపై విమర్శలు
ఈ సందర్భంగా వైసీపీపై.. పవన్ విమర్శలు గుప్పించారు. కాకినాడ సెజ్ కు భూములిచ్చిన రైతులకు మేలు జరగలేదని.. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైసీపీ నేతలు ఏం చేశారు.? అని ప్రశ్నించారు. 'నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని.. జగన్ లా సీఎం కొడుకుని కాదు. జగన్, సజ్జల, పెద్దిరెడ్డి అందరూ పేదవారట. కాకినాడ పోర్టు.. డ్రగ్స్, డీజిల్ మాఫియాకు అడ్డాగా మారింది. యువతకు రూ.5 వేల జీతం కావాలా.? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా.? అనేది ఆలోచించుకోవాలి. ప్రజాధనం దోచేసిన జగన్ పేదవాడు.. సొంత డబ్బును పంచిన నేను పెత్తందారుడినా..?. మద్య నిషేధం అని చెప్పి, కల్తీ మద్యం మరణాల్లో రాష్ట్రాన్ని ప్రథమం చేశారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు. వైసీపీని గద్దె దించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల్లో కూటమి కావాలో.. వైసీపీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి.' అని పవన్ పేర్కొన్నారు. ఈ సభకు జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
కాగా, పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో 5 రోజులు పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో క్యాంపెయిన్ చేయనున్నారు. ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు.